YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రధాని పర్యటనకు ముందే కడప స్టీల్ ప్లాంట్ కు గ్రీన్ సిగ్నల్

ప్రధాని పర్యటనకు ముందే కడప స్టీల్ ప్లాంట్ కు గ్రీన్ సిగ్నల్

నాలుగున్నరేళ్లుగా కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంలో తొలిసారి సానుకూల కదలిక కనిపించింది. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఉంటుందని, దాని కోసం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా ముందడుగు వేసిందని భావిస్తున్నారు. మరో పక్క వైజాగ్ రైల్వే జోన్ పై కూడా త్వరలోనే ఎదో ఒక ప్రకటన వస్తుందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయకపోవడం వల్ల రాజకీయంగా వచ్చే ముప్పును గ్రహించినట్లు కనబడుతోంది. కొద్దినెలల క్రితం టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రమేశ్‌ ఆమరణ దీక్ష చేపట్టడం, కొన్ని రోజుల కింద టీడీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ను కలసి వినతి పత్రం సమర్పించిన అనంతరం కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి.వారంలోగా సానుకూల ప్రకటన వెలువడుతుందని వారికి మంత్రి హామీ ఇచ్చారు. ఢిల్లీలో తన శాఖ అధికారులతో, మెకాన్‌ ప్రతినిధులతో సమీక్ష జరిపారు. స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుపై మెకాన్‌ ఇప్పటికే ముసాయిదా నివేదిక సమర్పించిన విషయం చర్చకు వచ్చింది. రాష్ట్రంలో ఎంత ఇనుప ఖనిజం లభ్యత ఉందో.. ఉక్కు ప్లాంటుకు అనువైన గ్రేడ్‌ ముడిఇనుము ఎంత లభిస్తుందో రాష్ట్రప్రభుత్వం సమాచారం ఇవ్వాల్సి ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో నియమించిన టాస్క్‌ఫోర్స్‌ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తోందని చెప్పారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇతర సమాచారం కోసం వేచి ఉండకుండా.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి పేర్కొన్నారు.ఈ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) సొంతంగా గానీ, ప్రైవేటు రంగంలో గానీ.. రెండింటి భాగస్వామ్యంతో గానీ స్థాపించడం సాధ్యమో కాదో త్వరితగతిన నివేదికను సమర్పించాలని మెకాన్‌ను ఆదేశించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని స్థాపిస్తే.. రాయలసీమ ప్రాంతానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. మెకాన్‌ సంస్థ నిరంతం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ మైనింగ్‌ లీజులు, ఇనుప ఖనిజం లభ్యతపై త్వరగా నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. ఈ సాంకేతిక నివేదికను టాస్క్‌ఫోర్స్‌ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. కేంద్రం స్పందించకుంటే.. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఏపీఎండీసీ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

Related Posts