నీటి వనరుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. వర్షపునీటిని ఒడిసిపట్టి భూగర్భజల మట్టాలు పెంచేందుకు కృషి చేస్తోంది. అంతేకాక సాగు-తాగునీటి సమస్యలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ కృషి ఫలించి సత్ఫలితాలే వస్తున్నాయి. అయితే సమస్యల మొత్తం అదుపులో ఉందని చెప్పలేని పరిస్థితి. పలు ప్రాంతాల్లో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు జిల్లా విషయానికి వస్తే సి.బెళగల్ వాసులు తాగునీటికి సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా తుంగభద్ర నది, సుంకేశుల జలాశయం రూపంలో నీటి వనరులు ఉన్నాయి. ఈ రిజర్వాయర్ ఆధారంగా సి.బెళగల్ పరిధిలోని పలు ప్రాంతాలకు తాగునీరు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా పెద్ద మొత్తంలోనే నిధులు విడుదల చేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ప్రాజెక్ట్ పనులు మాత్రం ఆశించిన స్థాయిలో సాగడంలేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రూ.20కోట్లకు పైగా వెచ్చించి నిర్మిస్తున్న ప్రాజెక్ట్ పై కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరిని తప్పుపడుతున్నారు. ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తై అందుబాటులోకి వస్తే పలు గ్రామాలకు సురక్షిత తాగునీరు అందుబాటులోకి వస్తుందని.. వేలమంది దాహార్తి తీరుతుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 22 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయాలన్నది లక్ష్యం. ఈ గ్రామాల జనాభా అరలక్షకు పైగానే ఉంటుంది. ఇంతమంది జనాభా ఉంటే నీటి వాడకం కూడా అధికంగానే ఉంటుంది. అందుకే కొత్తగా చేపట్టే ప్రాజెక్ట్ ద్వారా నీటి కొరత లేకుండా చేయాలని ప్రభుత్వం భావించింది.
సి.బెళగల్ పరిధిలోని ప్రజలు అధికంగా చేతిపంపులు, వ్యవసాయబోర్ల నీటిని వినియోగిస్తున్నారు. తాగునీటికి శుద్ధ జల కేంద్రాలపై ఆధారపడుతున్నారు. మామూలు రోజుల్లో పరిస్థితి ఎలా ఉన్నా వేసవి వస్తే మాత్రం నీటికి సమస్యలు ఎదురవుతున్నాయి. భూగర్భ జలమట్టాల శాతం తగ్గిపోవడంతో నీటి లభ్యత క్షీణిస్తోంది. బోర్ల నుంచి ఆశించిన స్థాయిలో నీరు రావడంలేదు. అడుగంటిన చలమల నుంచీ నీటిని సేకరించేవారు అనేకమంది ఉంటున్నారు. మరికొందరైతే డబ్బులు వెచ్చించి నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. శుద్ధజలం కోసం ప్రజలు చేస్తున్న ఖర్చు భారీగానే ఉంటోంది. ఏడాదికి వీరు సుమారు రూ.80లక్షలు ఖర్చు చేస్తారని అంచనా. అందుకే ఈ సమస్యలను పరిష్కరించి ప్రజలకు మంచినీరు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. అయితే నిర్మాణ పనులు మాత్రం మందకొడిగా సాగుతుండడంతో స్థానికుల్లో అసంతృప్తి నెలకొంది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ ను దాదాపు 9ఏళ్ల క్రితమే మొదలుపెట్టారు. అయితే వివిధ కారణాల వల్ల పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ 25శాతం పనులు చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తి కావడానికి చాలా సమయమే పడుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పనులు పూర్తి కావడానికి దాదాపు ఏడాది కాలం పట్టొచ్చని కొందరు చెప్తున్నారు. మరో నాలుగు నెలలు గడిస్తే.. వేసవి ఎఫెక్ట్ ప్రారంభమైపోతుంది. నీటికి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ లోపుగానే ప్రాజెక్ట్ ను పూర్తి చేసి నీటి సరఫరా జరిగేలా సంబంధిత అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలని అంతా కోరుతున్నారు. కొన్నేళ్లుగా అనుభవిస్తున్న నీటి కష్టాల నుంచి తమను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.