ఐటీ దాడులకు తాము భయపడటం లేదని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరీవ్యాఖ్యానించారు. ఐటీ అధికారులు వస్తుంటారు పోతుంటారని అన్నారు. ఐటీ అధికారులు ఏం చేయగలరని ప్రశ్నించారు. అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఐటీ దాడులు జరిగిన సందర్భం వేలరు..ఇప్పుడు జరుగుతున్న సందర్భం వేరని చెప్పారు. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్ర ఉక్కు మంత్రి ప్రకటన ఆశ్చర్యకరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు రాలేదనటం హాస్యాస్పదంగా ఉందన్నారు.మూడు మిలియన్ టన్నుల కెపాసిటీ ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన సమగ్ర సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. అది ఇవ్వలేదు..ఇది ఇవ్వలేదు అని ఇంకా చెప్పటం కుంటి సాకులేనని అన్నారు. ఇచ్చిన సమాచారం ఓసారి సరిచూసుకోవాలని హితవు పలికారు. ఉద్దేశపూర్వకంగా రాష్ట్రానికి నష్టం చేకూర్చే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం జరిగేలా కేంద్ర పెద్దలు వ్యవహరిస్తోన్నారని ధ్వజమెత్తారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక కక్షపూరితంగా కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.బీజేపీ చర్యలు ప్రజాస్వామ్యానికే ముప్పులా ఉన్నాయన్నారు. ఇప్పటికే ఏడు సార్లు సమగ్ర సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. సోమవారం మళ్లీ ఇస్తామని, అప్పుడైనా కేంద్రం కడప ఉక్కుపై సానుకూలంగా ప్రకటించాలని కోరారు.