తీర్పుతో నిషేధిత వయసు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలు భక్తుల విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పు అనంతరం తొలిసారి నెలవారీ క్రతువు కోసం శబరిమల ఆలయం బుధవారం తెరుచుకోగా, మహిళల ప్రవేశంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. కేరళ ప్రభుత్వం సుప్రీం తీర్పును అమలు చేస్తామని ప్రకటించడంతో ఘర్షణ వాతావరణం నెలకుంది. శతాబ్దాలుగా సాగుతోన్న సంప్రదాయాలు, ఆచారాలను మంటగలపొద్దంటూ చేపట్టిన ఆందోళనల్లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొవడం విశేషం. ఈ క్రమంలో శబరిమలలో ప్లకార్డు పట్టుకున్న ఓ తొమ్మిదేళ్ల చిన్నారి అందరి దృష్టి ఆకర్షించింది. ‘50ఏళ్ల తర్వాతే మళ్లీ శబరిమలను దర్శించుకుంటాను’ అంటూ ఆ చిన్నారి ప్లకార్డు ప్రదర్శిస్తూ స్వామిపై తన భక్తిభావాన్ని చాటుకుంది. అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలన్న సుప్రీం తీర్పుతో పలువురు మహిళా భక్తులు, సామాజిక కార్యకర్తలు ఆలయంలోకి వెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పోలీసుల సహాయంతో కొంత దూరం వెళ్లినప్పటికీ ఆందోళనల కారణంగా వారు వెనుదిరగక తప్పలేదు. దీంతో శబరిమల, సన్నిధానం, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మదురైకి చెందిన చిన్నారి జనని తన తండ్రితో కలిసి శుక్రవారం శబరిమలకు చేరుకుంది. ఇరుముడితో పదునెట్టాంబడి ఎక్కి తన చేతిలోని ప్లకార్డును ప్రదర్శించింది.. ‘నా పేరు జనని.. నాకు 50 ఏళ్లు వచ్చిన తర్వాతే మళ్లీ శబరిమల అయ్యప్పను దర్శించుకుంటాను. అప్పటి వరకు మళ్లీ రాను’ అని రాసిన ప్లకార్డు పట్టుకుని నిలబడింది. జనని తండ్రి సతీష్ కుమార్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో నాకు తెలియదు.. కానీ నా కుమార్తె పదేళ్లు పూర్తయిన తర్వాత, తిరిగి 50 ఏళ్ల వచ్చేంతవరకూ సన్నిధానంలో అడుగుపెట్టడదని అన్నారు. అయ్యప్ప అంటే తమకెంతో ఇష్టమని, నిషేధిత వయసులో తన కుమార్తె జనని ఆలయంలోకి ప్రవేశించదని పేర్కొన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం మహిళా భక్తుల ప్రవేశాన్ని ఎక్కువగా అడ్డుకున్న వారిలో మహిళలు, చిన్నారులే ఉన్నారు. నాలుగో రోజు కూడా శబరిమల పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నీలక్కల్ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో పంబ నుంచి బయలుదేరిన ఓ మహిళా భక్తురాలి వయసు ధ్రువీకరణ పత్రాలు చూపిన తర్వాతే శబరిగిరికి వెళ్లేందుకు అనుమతించారు. లతా అనే 52 ఏళ్ల మహిళ తలపై ఇరుముడి ధరించి తన కుటుంబసభ్యులతో కలిసి అయ్యప్ప దర్శనానికి బయలుదేరింది. అయితే.. ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన తర్వాతే ఆమెను అనుమతించారు. హైదరాబాద్‌కు చెందిన మహిళా జర్నలిస్ట్ కవిత, సామాజిక కార్యకర్త రెహ్మాన్ పాషాలు శుక్రవారం 300 మంది పోలీసుల భద్రత నడుమ శబరిమలకు చేరుకున్నారు. అయితే, ఆలయానికి 100 మీటర్ల దూరంలో ఆమెను భక్తులు అడ్డుకున్నారు. మరోవైపు వారు సన్నిధానంలోకి వస్తే ఆలయాన్ని మూసివేస్తామంటూ పూజార్లు పదునెట్టాంబడిపై కూర్చుని నిరసన తెలిపారు. స్వామి శరణుఘోషతోనే భక్తులు నిరసన తెలపడంతో పోలీసులు వెనకడుగు వేయక తప్పలేదు. అంతకు ముందు పందళ రాజకుటుంబం సైతం కీలక ఆదేశాలు ఇచ్చింది. సంప్రదాయాలను ఉల్లఘించి మహిళలు ప్రవేశిస్తే ఆలయం మూసివేయాలని స్పష్టం చేసింది. దీంతో ఆ ఇద్దరు మహిళలను పోలీసులు వెనక్కు పంపారు.