- 'గాయత్రి' రివ్యూ
చిత్రం: గాయత్రి
తారాగణం: మోహన్ బాబు, విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, అనసూయ, రఘుబాబు, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, తదితరులు
ఛాయాగ్రహణం: సర్వేశ్ మురారి
సంగీతం: తమన్
కథ, మాటలు: డైమండ్ రత్నబాబు
కథనంః మోహన్ బాబు
కథా విస్తరణః పరుచూరి బ్రదర్స్
నిర్మాత: మోహన్ బాబు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మదన్ రామిగని
విడుదల తేది: ఫిబ్రవరి 09, 2018
కథ ఏదైనా, నేపథ్యం ఏమైనా తన నటనతో, డైలాగ్ డెలివరీతో, హావభావాలతో ప్రేక్షకులని కట్టిపడేసే విలక్షణ నటుడు మోహన్ బాబు. నాలుగు దశాబ్దాలకి పైగా నట ప్రస్థానం ఆయన సొంతం. ఇక ‘ఆ నలుగురు’వంటి ఉత్తమ చిత్రంతో కథా రచయితగా మెప్పించి... ఆ పై ‘పెళ్ళైన కొత్తలో’, ‘గుండె ఝల్లుమంది’, ‘ప్రవరాఖ్యుడు’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మదన్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘గాయత్రి’. తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో మంచు విష్ణు, శ్రియ, అనసూయ, నిఖిలా విమల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై మనం అందిస్తున్న సమీక్ష మీకోసం.
కథ: సాంఘీకం, జానపదం, చారిత్రాత్మకం, పౌరాణికం.. ఇలా ఏ తరహా పాత్రకైనా న్యాయం చేయగల విలక్షణ రంగస్థల నటుడు దాసరి శివాజీ (మంచు విష్ణు). అతని ప్రతిభకి ముగ్ధురాలై అతన్ని ప్రేమిస్తుంది శారద (శ్రియ). శారద తండ్రి అంగీకారంతో ఇద్దరూ పెళ్ళిచేసుకుంటారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో.. శారద తండ్రి మరణిస్తాడు. దాంతో.. వేరే ఇంటికి షిప్ట్ అవుతారు శివాజీ దంపతులు. గర్భంతో ఉన్న శారదకి ఉన్నట్టుండి కొత్త రకం క్యాన్సర్ ఉంటుంది. దాని చికిత్స కోసం డబ్బు అవసరపడుతుంది. అదే సమయంలో.. వేరే వాళ్ళ వేషంలో నటిస్తే.. 2 రోజుల్లో ఆ మొత్తం దక్కుతుందని తన సహనటుడు చెప్పడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో వేయరాని వేషం వేయడం కోసం.. భార్యని ఆసుపత్రిలోనే ఒంటరిగా వదిలి మరీ వెళ్ళిపోతాడు శివాజీ. 2 రోజులు అనుకున్నది కాస్త 2 వారాలు పడుతుంది. తీరా ఇక్కడికి వస్తే.. తన భార్య పాపని కని చనిపోయిందని తెలుస్తుంది. అంతేగాకుండా, తన సహనటుడు తాగుడు ఖర్చుల కోసం పాపని వెయ్యి రూపాయిల కోసం అమ్మబోతే అనాధ శరణాలయం వారు ఆ పాపని తీసుకెళ్ళిపోయారు అని తెలుస్తుంది. పాప కోసం అన్ని రకాల శరణాలయాల్లో వాకబు చేస్తాడు. అయినా.. ప్రయోజనం ఉండదు. కట్ చేస్తే.. పాతికేళ్ళ తరువాత మళ్ళీ ఆ తండ్రి (మోహన్ బాబు), కూతురు (నిఖిలా విమల్) కలిసే సందర్భం వస్తుంది. తీరా, తన కూతురు ఎవరో తెలిశాక.. ఆ అమ్మాయికి తానే ఆమె నాన్న అని చెబుదామనుకున్న సమయంలో.. ఆ అమ్మాయికి తండ్రి అంటే ద్వేషం తప్ప మరేమీ లేదని తెలిసి కుమిలిపోతాడు. తీరా, తండ్రి గత జీవితం గురించి నిజాలు తెలుసుకున్న కూతురు.. తండ్రికి దగ్గరవుదామని ప్రయత్నిస్తున్న సమయంలో వారి జీవితంలోకి అనూహ్యంగా వస్తాడు గాయత్రీ పటేల్ (మోహన్ బాబు). ఇంతకీ గాయత్రీ పటేల్ ఎవరు? ఒకేలా ఉన్న శివాజీ, గాయత్రీ పటేల్ మధ్య ఏమైనా సంబంధం ఉందా? శివాజీ కూతురిని గాయత్రీ పటేల్ ఎందుకు చంపాలకున్నాడు? చివరకు తండ్రీ కూతుళ్ళు ఒకటయ్యారా? వంటి ప్రశ్నలకి సమాధానమే ‘గాయత్రి’
విశ్లేషణ : ప్రధానంగా తండ్రీ కూతుళ్ళ మధ్య నడిచే కథ ఇది. పుట్టినప్పుడు ఓ సారి.. పాతికేళ్ళ తరువాత మరోసారి.. ఇలా తన బిడ్డని కలుద్దామని అనుకున్న ప్రతిసారీ ఓ తండ్రికి కాలం అడుగడుగున పరీక్షలు పెడుతుంది. తీరా కలిసే సమయానికి తను ఎవరి కోసమైతే బతుకుతున్నాడో.. ఆ కూతురే తనని పరిస్థితుల ప్రభావం వల్ల ద్వేషిస్తుందని తెలిసి మధన పడే ఓ తండ్రి వ్యధగా ఈ సినిమాని సెంటిమెంట్ మయంగా మదన్ తెరకెక్కించారు. అయితే కథనం నెమ్మదించడం వల్ల సినిమా గమనం మందకొండిగా సాగిందనే చెప్పాలి. ప్రథమార్ధం మరీ నెమ్మదించినా.. ద్వితీయార్ధంలో గాయత్రీ పటేల్ రాకతో కాస్త వేగం పెరిగినట్లయ్యింది. ఈ సినిమాకి ఏదైనా ప్లస్ ఉందంటే.. అది గాయత్రీ పటేల్ క్యారెక్టరైజేషన్ మాత్రమే. దాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అలాగే పతాక సన్నివేశాల్లో వచ్చే వాలి,సుగ్రీవుల తరహా పోరాట సన్నివేశం కూడా అలరిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. దాసరి శివాజీ, గాయత్రీ పటేల్.. ఇలా రెండు విభిన్న పాత్రల్లో మోహన్ బాబు కనిపించారు. అయితే.. ఆయన మార్క్ నటన కనిపించేది కేవలం గాయత్రీ పటేల్ పాత్రలోనే. ఆ పాత్రలో ఆయన లుక్, డైలాగ్స్ బాగున్నాయి. ఆయన కూతురిగా నటించిన నిఖిలా విమల్ నటన అంతంత మాత్రమే. టీవీ జర్నలిస్ట్ శ్రేష్ఠ పాత్రలో అనసూయ మెప్పిస్తుంది. శివాజీ యంగ్ వెర్షన్‌గా విష్ణు, అతని భార్య శారదగా శ్రియ ఇద్దరి పాత్రల్లోనూ బలం లేదు. సరైన సన్నివేశాలు పడకపోవడం వల్ల ఆ పాత్రల్లో జీవం లోపించింది. నటన కూడా కృత్రిమంగా ఉంది. మిగిలిన పాత్రలేవీ గుర్తుండిపోయేవి కావు. ప్రస్తావించుకోవడానికి అయితే పెద్ద పేర్లే కానీ.. విషయం శూన్యం.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ మధ్య మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన తమన్ సంగీతంలో “ఒక నువ్వు ఒక నేను” అనే మెలోడీ తప్ప గుర్తుండిపోయే పాట ఏమీ లేదు. మిగిలిన పాటలను బాలు, మనో, శంకర్ మహదేవన్, మధు బాలకృష్ణన్ వంటి వాళ్లు ఆలపించినా.. గుర్తుండిపోయే ట్యూన్స్ కాకపోవడం వల్ల కనెక్ట్ కావు. ఇక, నేపథ్య సంగీతం అయితే ఎక్కడా మెప్పించకపోయింది. సర్వేష్ మురారి ఛాయాగ్రహణం బాగుంది. ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉండాల్సింది. “ప్రాణమిచ్చే పంచభూతాలు రెండో పేజీ తెరిస్తే ప్రళయ తాండవాలు చేస్తాయి”, ‘రోగం తెలీకుండా వైద్యుణ్ణి...నిజం తెలీకుండా మనిషిని ద్వేషించకూడదు”. “ప్రపంచాన్ని డబ్బు లీజుకి తీసుకుంది...అమ్ముడు పోనీ వస్తువు లేదు”, “అక్షరాలు లేని స్వచ్చమైన భాష నవ్వు”, ‘కత్తో, కర్రో పట్టుకుంటే ఎవడైనా రౌడీ కావచ్చు. కానీ, నటుడు అందరూ కాలేరు”, “రామాయణంలో రాముడికి రావణాసురుడికి గొడవ...మహాభారతంలో పాండవులకి, కౌరవులకి మాత్రమే గొడవ...వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోతే బాగుండేది. కాని వాళ్ళ మూలంగా జరిగిన యుద్ధంలో లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్ళు చేసింది తప్పయితే...ఇక్కడ నేను చేసింది కూడా తప్పే...అక్కడ వాళ్ళు దేవుళ్లైతే, నేనూ దేవుడ్నే...అర్ధం చేసుకుంటారో..అపార్ధం చేసుకుంటారో ఛాయిస్ ఈస్ యువర్స్”, “దేవుడు చాలా మంచివాడు, రాక్షసులకు కూడా వరాలు ఇస్తుంటాడు”, “రామాయణం ఒక ఆడదాని ఏడుపు వల్ల జరిగింది...భారతం ఒక ఆడదాని నవ్వు వల్ల జరిగింది” వంటి మాటలు అలరిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్: గాయత్రీ పటేల్ క్యారెక్టరైజేషన్.,ఒక నువ్వు ఒకే నేను పాట.,డైలాగ్స్.,ద్వితీయార్థం.,నిర్మాణ విలువలు.
మైనస్ పాయింట్స్ : స్లో నెరేషన్., ప్రథమార్ధం., కామెడీ లేకపోవడం., ఎమోషన్స్ పండకపోవడం.
- సూర్య ప్రకాష్, సినీ విశ్లేషకులు