108 వాహనాల పనితీరు జిల్లాలో తీవ్ర నిరాశాజనకంగా మారింది. బాధితులు ప్రమాదకర పరిస్థితిలో ఉన్న సమాచారం అందుకున్నా సిబ్బంది వెంటనే స్పందించక పోవడం ప్రాణసంకటంలా పరిణమిస్తోంది. ఇటీవల కత్తిపూడి శివారులో మానసిక వికలాంగురాలైన ఓ మహిళ నెలలు నిండకుండానే రోడ్డుపై ప్రసవించగా స్థానికులు సమాచారం ఇచ్చినా మూడు గంటల తరువాత 108 వాహనం సంఘటన స్థలానికి చేరుకోవడం దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.ఆ మహిళ జన్మనిచ్చిన నవజాత శిశువు అప్పటికే మృత్యువాతపడగా తల్లికి సైతంసకాలంలో వైద్య సేవలు అందించలేక పోయారు. జిల్లాలో 108 సేవలు సకాలంలో అందక గతంలో కొందరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగినా.. అనారోగ్యానికి గురైనా..పురిటినొప్పులతో ఇబ్బందులు పడుతున్నా వెంటనే 108కు ఫోన్ చేస్తున్నా వాటి సేవలు సకాలంలో అందడం లేదు. జిల్లాలో ఈ సమస్య చాలా కాలంగా ఉన్నా పరిష్కారంపై అధికారులు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో 108 వాహనాలు 42 ఉండగా వాటిలో ఆరు శిథిలావస్థకు చేరాయి. మరో మూడు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ప్రస్తుతం 33 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉండగా వాటిలోనూ పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవు. ప్రధాన ఆసుపత్రుల్లో ప్రభుత్వ అంబులెన్సులు ఉన్నా వీటిని వినియోగించడం లేదు. దీంతో పలు సందర్భాల్లో 108 ద్వారానే బాధితులను కాకినాడ వంటి దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుని ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం ఓ మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా అంబులెన్సును కేటాయించక పోవడంతో 108లో కాకినాడకు తీసుకెళ్లారు. దీంతో ఈ వాహనం తుని నుంచి కాకినాడకు వెళ్లి తిరిగి వచ్చే సరికి సుమారు నాలుగైదు గంటలు పడుతుంది. ఈ సమయంలో ప్రమాదాలు జరిగినా, ఏమైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనా 108 వాహనాలు సకాలంలో అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తుని ప్రాంతీయ ఆసుపత్రిలో ఒక అంబులెన్సు ఉండగా దీని నిర్వహణకు అవసరమయ్యే డీజిల్ కోసం మూడు నెలలకు రూ.20 వేలు కేటాయిస్తున్నారు. ఈ మొత్తం చాలక పోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో బాధితులను కాకినాడకు తీసుకెళ్తే డీజిల్ వ్యయం కింద సుమారు రూ.1,200 తీసుకుంటున్నారు.పేదలు అంత మొత్తాన్ని చెల్లించలేక 108 సేవలను వినియోగించుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అనేక మందికి సకాలంలో వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలోని 108 వాహనాల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండటం లేదు. ఇటీవల అనారోగ్యంతో తల్లడిల్లుతున్న ఓ శిశువును తుని నుంచి కాకినాడకు తరలించేందుకు 108ను ఆశ్రయించినా అందులో ఆక్సిజన్ లేకపోవడంతో ప్రయోజనం లేకపోయింది. చివరకు ఆ శిశువును ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. జిల్లాలో 15కు పైగా 108 వాహనాల్లో ఆక్సిజన్ లేక ఖాళీ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి.వీటిని ఎప్పటికప్పుడు నింపేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టడం లేదు