ఏపీలోని 13 జిల్లాల్లో జనసేన చాలా బలంగా ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్న జిల్లా తూర్పుగోదావరి. 13 జిల్లాల్లో 19 అసెంబ్లీ సీట్లతో అతి పెద్ద జిల్లాగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో పవన్ వీరాభిమానులు, జనసేన అభిమానులు… కాపు సామాజికవర్గం బలంగా ఉండడంతో జనసేన ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉండే ఛాన్సులు ఉన్నాయి. పలువురు కీలక నేతలు సైతం ఇతర పార్టీల నుంచి జనసేనలోకి కొంత మంది ఇప్పటికే జంప్ చెయ్యగా మరి కొందరు సైతం అదే రూట్‌లో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేనాని తమ తొలి అభ్యర్థిని సైతం ఇదే జిల్లా నుంచి ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మడివరం నియోజకవర్గం నుంచి పితాని బాలకృష్ణను జనసేన తొలి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.వైసీపీలో జగన్ పక్కన పెట్టిన చాలా మంది కీలక నేతలు సైతం ఇప్పుడు జనసేన వైపే చూస్తున్నారు. ఆ పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో సీటు రాదని భావిస్తోన్న వారు సైతం జనసేన చెంతకు చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల నాటికి టీడీపీ, వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు సైతం జనసేనలోకి జంప్ చేసేస్తారనికూడా తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు జనసేన అధినేత, కీలక నేతలతో టచ్‌లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇదే జిల్లాకు చెందిన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సైతం టీడీపీలో కాస్త అసంతృప్తితో ఉంటున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తోట త్రిమూర్తులు బాబు కేబినేట్‌లో మంత్రి పదవి ఆశించారు.కాపు సామాజికవర్గానికి చెందిన త్రిమూర్తులకు బదులుగా పార్టీకి ఎప్పటి నుంచో విధేయతతో ఉంటున్న చినరాజప్పకు మంత్రి పదవి ఇవ్వడంతో ఆయనకు కేబినెట్ బెర్త్ రాలేదు. గత ఏడాది జరిగిన ప్రక్షాళనలో అయిన తనకు కేబినేట్ బెర్త్ వస్తుందని ఆశించారు. అయిన తోట ఆశ నిరాశే అయ్యింది. తనకు మంత్రి పదవి చేపట్టాలన్న ఉందని తోట సైతం పలుమార్లు బహిరంగంగానే తన కోరిక వ్యక్తం చేశారు. అలాగే మంత్రి పదవి రాలేదని అసంతృప్తిని సైతం బయట పెట్టారు. పార్టీలో సీనియర్‌గా ఉన్నా… జిల్లా రాజకీయాల్లో తన మాట నెగ్గకపోవడంతో టీడీపీలో కక్కలేక మింగలేక అన్న చందంగా ఉంటున్న త్రిమూర్తులు జనసేనలోకి వెళ్లేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మధ్యవర్తిత్వం పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలిసింది.త్రిమూర్తులు గతంలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి 2009లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ అనుబంధంతోనే ఇప్పుడు జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చెయ్యగా పవన్ మాత్రం త్రిమూర్తులను పార్టీలో చేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చెయ్యలేదని తెలిసింది. రాజకీయంగా ఇప్పటికే పలు పార్టీలు మారిన తోట త్రిమూర్తులకు వ్యక్తిగతంగా వివాదాల్లో ఉంటారన్న పేరుంది. ఈ క్రమంలోనే ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు పవన్ ఇష్టపడడం లేదట. మరి తోట నయా డెసిషన్ ఎలా ఉంటుందో ? చూడాలి.