మేకోవర్ కోసం ఎన్ని గంటలైనా మేకప్ వేసుకుంటాడు. క్యారెక్టర్ కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తాడు. సినిమా అంటే కమల్ హాసన్ కు అంత ఇష్టం. గతంలో కమల్ పోషించిన పాత్రల్ని గుర్తుచేసుకుంటే అతడి కష్టం కళ్లముందు కదుల్తుంది.ఇప్పుడు ఇండియన్-2 కోసం కూడా అలాంటి ప్రయత్నమే చేయబోతున్నాడు కమల్. ఈ సినిమా కోసం స్లిమ్ గా తయారవ్వాలని ఫిక్స్ అయ్యాడు. దీని కోసం ప్రత్యేకంగా ఫారిన్ ట్రయినర్ ను నియమించాడు. అతడి పర్యవేక్షణలో ఆల్రెడీ కసరత్తులు స్టార్ట్ చేశాడు.శభాష్ నాయుడు సినిమా టైమ్ లో కమల్ మోకాలికి పెద్ద దెబ్బ తగిలింది. ఆ గాయం నుంచి కోలుకునే క్రమంలో కాస్త లావెక్కాడు ఈ హీరో. పైగా అదే టైమ్ లో రాజకీయ రంగప్రవేశం కూడా చేయడంతో.. బాడీపై కంట్రోల్ తప్పాడు. ఇప్పుడు ఇండియన్-2 కోసం తప్పనిసరిగా తగ్గాలి. దర్శకుడు శంకర్, కమల్ నుంచి కోరుకునేది ఇదే. అందుకే కమల్ హాసన్ ఇప్పుడు కనీసం 15 కిలోలు తగ్గాలని ఫిక్స్ అయ్యాడు. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను, సినిమాటోగ్రాఫర్ గా రవివర్మన్ ను ఫిక్స్ చేశారు. 2.0 సినిమా రిలీజైన వెంటనే ఇండియన్-2కు సంబంధించి మరిన్ని వివరాలు బయటపెడతాడు దర్శకుడు శంకర్.