టిడిపి కి ఇప్పుడు బిజెపి రాజ్యసభ్యుడు జివిఎల్ నరసింహారావు కొరకరాని కొయ్యగా మారారు. ఒకే ఒక్కడుగా కమలం పార్టీ నుంచి చెలరేగిపోతున్నారు జివిఎల్.ఏపీలో సీఎంరమేష్ పై ఆాదాయపుపన్ను శాఖ దాడులకు ముందు నుంచే నరసింహారావు కమలం వాయిస్ పెంచుతూ వచ్చారు. ఆయన నిత్యం మీడియా ముందుకు వస్తూ ఏదో ఒక అంశంపై చంద్రబాబు అండ్ టీం పై విరుచుకుపడుతూ వచ్చే వారు. దీనికి టిడిపి సైతం ఘాటుగా ఒకరిద్దరితో సమాధానాలు చెప్పించి ఊరుకునేది. అయితే ఎప్పుడైతే రమేష్ పై ఐటి ఎటాక్ జరిగిందో అప్పటినుంచి జివిఎల్ కి నోటినిండా పని దొరికింది. దాంతో ఆయన చేస్తున్న ఆరోపణలు, విమర్శలు వ్యంగ్యాస్త్రాలు ఎపి ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ప్పుడు ఏపీలో హాట్ టాపిక్ వారిద్దరే. ఒకరు సిఎం రమేష్ మరొకరు జివిఎల్ నరసింహ రావు. ఇద్దరి నడుమ సవాళ్ళు ప్రతి సవాళ్ళతో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఏపీలో ఐటి రైడ్స్ మొదలైన దగ్గరనుంచి వీరినడుమ మొదలైన మాటల యుద్ధం రోడ్ ఎక్కి ఛానెల్స్ కి రేటింగ్స్ పెంచే స్థాయికి వెళ్ళింది. తాజాగా జివిఎల్ చేసిన ఆరోపణలు విమర్శలతో ప్రతి దాడి చేశారు రమేష్. దాంతో వీరి నడుమ వార్ ఇప్పట్లో ముగిసేలా లేదని తేలిపోతుంది. ఆర్ధిక అవినీతి మూలాలన్నీ సిఎం రమేష్, సుజనా చౌదరి, నారాయణ వంటివారి దగ్గరే వున్నాయన్న బలమైన ఆధారాలు సేకరించింది బిజెపి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో నిలవాలంటే తాము మద్దతు ఇచ్చేవారు గెలవాలన్న పసుపు కోట ఆర్ధిక మూలాలు నాశనం చేయడం కమలం యుద్ధ వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది. నేరుగా చంద్రబాబు ను లోకేష్ ను టార్గెట్ చేయకుండా వారి బినామీలుగా ఆరోపణలు వున్న వారిపై దాడులు మొదలు పెట్టింది కేంద్ర ఆర్ధిక నేర నియంత్రణ విభాగాలు. రావడం రావడమే రమేష్ పై పడిపోయి మానసికంగా టిడిపి పై విజయం సాధించింది కమలం. వీరి దాడుల్లో సీన్ ఏమి లేదని నిరూపించుకునే క్రమంలో మీసం మెలేసి రమేష్ తొడకొట్టడంతో కసి మీద వున్న జివిఎల్ జాతీయ మీడియా లో ప్రచురితమైన వార్తలను ఆయుధాలుగా చేసుకుని మరోసారి రంగంలోకి దిగారు. 100 కోట్ల రూపాయల దొంగ ఇదిగో అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.ఆ వెంటనే రంగంలోకి దిగిన రమేష్ తాను వంద కోట్ల రూపాయల అంశం పై విచారణకు సిద్ధమని అమిత్ షా రాఫెల్ డీల్ పై విచారణకు సిద్ధమా అంటూ ప్రతి సవాల్ చేశారు. తమపై కేంద్ర ప్రభుత్వం కావాలనే కేంద్రం బురద జల్లుతుందనే ఆరోపణలు సంధించారు ఆయన. రమేష్ కి మద్దతుగా టిడిపి నేత ఎమ్యెల్సీ బుద్దా వెంకన్న సీన్ లోకి వచ్చారు. ఆయన జివిఎల్ పై నేరుగా ఆరోపణలు మొదలు పెట్టేశారు. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు తీవ్రం చేసుకుంటూ మొత్తానికి అయోమయం రాజకీయాలను మరోసారి తెరపైకి తెచ్చాయి బిజెపి, టిడిపిలు. ఈ ప్రభావం ఏ పార్టీకి లబ్ది చేకురుస్తుందో చూడాలి మరి.టిడిపి ఇప్పుడు జివిఎల్ ను ఒకరిద్దరితో ఎదుర్కోవడం కాకుండా ముప్పేట దాడి చేసి నోరు మూయించాలనే వ్యూహంతో ముందుకు సాగుతుంది. లెక్కల మాస్టర్ లా గణాంకాలతో వివరణ ఇచ్చే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మొదలు బుద్ధా వెంకన్న, బోండా ఉమా, దేవినేని, సోమిరెడ్డి, మొదలు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మెన్ ఆనంద సూర్య వరకు ఇప్పుడు అందరి టార్గెట్ జివిఎల్ గా మారిపోయారు. జివిఎల్ ను ఎదుర్కోవడం ఒక్క సిఎం రమేష్ వల్ల సాధ్యం కాదని ఐటి రైడ్స్ లో ఆయన నిందితుడిగా వున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను ప్రజలు సీరియస్ గా తీసుకోరని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. రమేష్ ఎప్పటినుంచో చంద్రబాబు, లోకేష్ ల బినామీలన్న ప్రచారం ఓటుకు నోటు కేసు నుంచి టిడిపి ప్రత్యర్ధులు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారు. దాంతో పాటు ఏపీలో అత్యధిక ప్రాజెక్ట్ లు రమేష్ కంపెనీలే చేపట్టడం ఆయన టిడిపి అధినేత బినామీ నే అన్న ఆరోపణలు విమర్శలకు బలం చేకూరుస్తుంది. ఈ నేపథ్యంలో జివిఎల్ ను ఏమాత్రం ఉపేక్షించినా నిత్యం ఆయన చేస్తున్న ప్రచారం టిడిపి కి డ్యామేజ్ తెచ్చి పెట్టడం ఖాయమనే అంచనాతో ఒక్కడి కోసం పదుల సంఖ్యలో దాడికి దిగారు పసుపుదళం నాయకులు. మరి ఈ గేమ్ లో విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో చూడాలి.