YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఈ ఆలయాల్లో పురుషులకు నో ఎంట్రీ...

ఈ ఆలయాల్లో పురుషులకు నో ఎంట్రీ...
శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు.. ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఆలయంలోకి ప్రవేశాన్ని మహిళా సాధికారతతో ముడిపెడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు వస్తున్నాయి. సాంప్రదాయాలను హేళన చేస్తున్నరంటూ మండిపడుతున్నారు. ప్రపంచంలో మరే దేశంలో కనిపించని విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలు ఇండియా సొంతం. ప్రపంచంలోని ఇతర మతస్తుల ప్రార్థనా మందిరాలకు ఉన్నట్లే.. దేశంలోని ప్రతి హిందూ ఆలయానికి కొన్ని ఖచ్చితమైన నియమాలు ఉంటాయి. వీటిని తరతరాలుగా పాటించడం ప్రజలు ధర్మంగా భావిస్తారు. శబరిమల వంటి ఆలయంలోకి వెళ్లే పురుషులు సైతం కఠిన దీక్షలు చేసిన తర్వాతే అయప్పను దర్శించుకుంటారు. అయితే, ఇక్కడ మహిళలపై ఉన్న ఆంక్షల వివాదాన్ని పక్కన పెడితే.. దేశంలో పురుషులకు సైతం ప్రవేశం లేని ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి పూర్తిగా పురుషుల ప్రవేశంపై నిషేదం ఉండగా, మరికొన్నింటికి ప్రత్యేక దినాల్లో పురుషులను అనుమతించారు. 
అత్తుకల్ ఆలయం: 
కేరళలో ఉన్న ఈ ఆలయం.. సుమారు మూడు మిలియన్ మంది మహిళలతో సంక్రాంతి వేడుకలు నిర్వహించి.. ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’కు ఎక్కింది. ఈ పండుగ సమయంలో అత్తుకల్ ఆలయంలోకి పురుషులకు ప్రవేశం ఉండదు. కేవళం మహిళలు మాత్రమే ఆలయంలోకి వెళ్లాలి. 
చక్కులతుకవు ఆలయం: 
ఈ ఆలయం కూడా కేరళలోనే ఉంది. భగవతీ మాత కొలువైన ఈ ఆలయంలో డిసెంబరు నెల మొదటి శుక్రవారం ‘నారీ పూజ’ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉండే పూజారి (పురుషుడు) పది రోజుల పాటు కఠిన ఉపవాసం చేసే మహిళల కాళ్లు కడుగుతారు. దీన్ని ‘ధనున’ అని పిలుస్తారు. నారీ పూజ జరిగిన రోజుల్లో ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదు. 
బ్రహ్మ ఆలయం: 
రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఉన్న 11వ శతాబ్దపు నాటి ఆలయం ఇది. ఈ ఆలయంలోకి పెళ్లైన పురుషులకు అనుమతి ఉండదు. ప్రపంచంలో ఉన్న ఏకైక బ్రహ్మదేశాలయంగా ఈ ఆలయానికి పేరుంది. పుష్కర్ సరస్సు వద్ద బ్రహ్మదేవుడు చేస్తున్న యజ్ఞానికి ఆయన భార్య సరస్వతి దేవీ ఆలస్యంగా వస్తుంది. దీంతో బ్రహ్మ గాయత్రి మాతను వివాహం చేసుకుని యజ్ఞం పూర్తి చేస్తాడు. దీంతో పెళ్లైన వ్యక్తులు ఈ ఆలయంలోకి ప్రవేశించరాదని సరస్వతి దేవి శపిస్తుంది. ఒకవేళ ప్రవేశిస్తే వారి వైవాహిక జీవితంలో తిప్పలు తప్పవని నమ్ముతారు. 
భగతి మా ఆలయం: 
తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న ఈ ఆలయంలోకి పురుషులను అనుమతించరు. అమ్మాన్ ఆలయంగా పిలిచే ఈ ఆలయంలో భగవతి దుర్గ కొలువై ఉంది. శివుడు తనను పెళ్లి చేసుకోవాలని తపస్సు చేసేందుకు భగవతి దుర్గ సముద్రం మధ్యలోకి వెళ్లిందని పలువురు చెబుతారు. అలాగే, సతీదేవి వెన్నెముక పడిన ఈ ప్రాంతం పుణ్యక్షేత్రంగా మారిందని మరికొందరు చెబుతారు. అయితే, ఈ ఆలయంలోకి పురుషుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేదించారు. కేవలం సన్యాసులకు మాత్రమే ప్రవేశ ద్వారం వరకు అనుమతి ఉంటుంది. పెళ్లైన మగవారిని లోపలికి అనుమతించరు. ఈ ఆలయం బంగాళాఖాతం, అరేబియా, హిందూ సముద్రాలు కలిసే చోట ఉంది. 
త్రింబకేశ్వర ఆలయం: 
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ఆలయం ఉంది. 2016 వరకు ఈ ఆలయం గర్భగుడిలోకి స్త్రీలకు అనుమతి లేదు. బోంబే హైకోర్టు ఆదేశాల తర్వాత పురుషులను సైతం గర్భగుడిలోకి అనుమతించడం లేదు. 
కామరూప్ కామఖ్య ఆలయం: 
అస్సాంలోని ఈ ఆలయంలో పూజారిగా మహిళలు, సన్యాసులకు మాత్రమే ఉంటారు. రుతుక్రమం సమయంలో కూడా మహిళలు ఈ ఆలయంలోకి ప్రవేశించవచ్చు. అయితే, పురుషులను ఎట్టి పరిస్థితిలో ఈ ఆలయంలోకి అనుమతించరు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవిని ఖండించగా.. ఆమె నడుము భాగం ఇక్కడ పడిందని చెబుతారు. ఈ సందర్భంగా సతిదేవి ఋతు వస్త్రాలను ఇక్కడ పవిత్రమైనదిగా భావిస్తారు. వీటిని భక్తులకు కూడా అందజేస్తారు. 
కామాఖ్య పీఠం: 
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గల కామాఖ్య పీఠంలో నారీపూజ చేస్తారు. నాలుగు నుంచి ఐదు రోజులు పాటు పురుషులకు ప్రవేశం ఉండదు. కేవలం స్త్రీలను మాత్రమే అనుమతిస్తారు. 
మాతా దేవాలయం: 
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉన్న మాతా ఆలయంలోకి పురుషులకు ప్రవేశం లేదు. రుతుక్రమం సమయంలో కూడా మహిళలకు ఈ ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. ఇక్కడి ఆలయ సాంప్రదాయాన్ని గౌరవించి పురుషులు ఈ ఆలయం పరిసరాల్లో కూడా అడుగుపెట్టరు. అలా చేస్తే అమ్మవారిని అగౌరవ పరిచినట్లేనని భావిస్తారు. 
సంతోషి మాత ఆలయాలు: 
దేశంలోని సంతోషి మాత ఆలయాల్లోకి పురుషులకు అనుమతి ఉండదు. ముఖ్యంగా సంతోషి మాత వ్రతం ఆచరించే ఎన్నో ఆహార నియమాలు పాటిస్తారు. కొన్ని ప్రాంతాల్లోని సంతోషిమాత ఆలయాల్లోకి పురుషులకు అనుమతి ఉన్నా.. కొన్ని నియమనిష్టలు పాటిస్తేనే ప్రవేశానికి అర్హులని చెబుతారు. 

Related Posts