వచ్చే నెల నుండి రేషన్ దుకాణాల ద్వారా రూపాయికే కిలో రాగులు, జొన్నలు సరఫరా చేయ్యనుంది రాష్ట్ర ప్రభుత్వం. పేదలకు పౌష్టిక విలువలు ఎక్కువుగా లభ్యమయ్యే చిరుధాన్యాలను ప్రభుత్వం కారుచౌకగా అందించాలని నిర్ణయించింది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులు, జొన్నలను కేజీ రూపాయికే పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం అయింది. వచ్చే నెల నుంచి జిల్లాలోని అన్ని చౌక డిపోల్లో తెల్లకార్డుదారులకు ప్రయోగాత్మకంగా అందించేందుకు సర్వం సిద్ధం చేశారు. 150 టన్నుల రాగులు, మరో 150 టన్నుల జొన్నలను జిల్లాలోని 16 సివిల్ సప్లై స్టాక్ గొడౌన్లకు పంపిణీ చేశారు. వీటి పంపిణీలో ఓ నిబంధన విధించింది. 2కేజీలు రాగులు, జొన్నలు తీసుకుంటే కార్డుదారునికి 2కేజీల బియ్యన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. జిల్లాలో 2217 చౌకడిపోలున్నాయి. దాదాపు 11లక్షల 10వేల మందికి పైగా తెల్లకార్డుదారులు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతి నెల రూపాయికే కేజీ బియ్యం పంపిణీ చేస్తున్నది. ఇంటిలోని జనాభకు అనుగుణంగా 15 నుంచి 25 కేజీల చొప్పున బియ్యం అందిస్తుంది. అయితే రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ మంది జొన్నలు, రాగులు తినడం ఆనవాయితీ. రాగిసంకటి, జొన్న రొట్టెలను అక్కడి ప్రజలు ఎక్కువుగా తింటారు. ప్రస్తుతం వీటి ధర మార్కెట్‌లో ఎక్కువుగా ఉండడంతో వీటిని కారుచౌకగా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రస్తుతం నాణ్యత కలిగిన రాగులు కేజీ రూ.25 పలుకుతుంది. ఆదే రెండో రకమైతే రూ.15 నుంచి రూ.20 వరకు ఉన్నాయి. ఇక జొన్నలు మొదటి రకం కేజీ రూ.20 ఉండగా.. రెండో రకం రూ.15 నుంచి రూ 18 మధ్య ఉంది. ఈ ధరలు పేదలకు భారం కావడంతో బియ్యాన్ని తగ్గించి వాటి స్థానంలో రాగులు, జొన్నలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దీన్ని నవంబర్ నెల నుంచి అమలు చేసేందుకు సిద్ధమైంది. వినియోగాన్ని బట్టి డిసెంబర్, జనవరి నుంచి బియ్యాన్ని తగ్గించి వీటిని ఎక్కువ మొత్తంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు వీటి వినియోగం వల్ల అరోగ్యానికి కలిగే ఉపయోగాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కూడా నిర్ణయించింది.