నెల్లూరు పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో శరన్నవ రాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. 10వ రోజు విజయదశమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని పలు అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా పట్టణంలోని జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో తాళాలు వేసిన తలుపులు వేసినట్లుగానే ఉండగా, అర్ధరాత్రి వేళ ఓ మహిళ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేస్తుందని, గజ్జెల శబ్ధం వినిపిస్తోందని పుకార్లు షికార్లు చేశాయి. దుర్గాష్టమి రోజు రాత్రి నుంచి ఇలా జరుగుతుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కొందరు యువకులు తమ సెల్ఫోన్ కెమెరాల్లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. పసుపురంగు వస్త్రాలు ధరించిన ఓ మహిళ ముఖం కనిపించకుండా ఆలయ ప్రాంగణంలో అర్ధరాత్రి ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం పలు టీవీ జర్నలిస్టులు ఆలయానికి చేరుకుని భక్తుల అభిప్రాయాలను చిత్రీకరిస్తుండడంతో అక్కడ సందడి నెలకొంది. మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారన్న వాదనలు ఓ వైపు వినిపిస్తున్న భక్తి మార్గంలో ఉండే పలువురు అమ్మవారి శక్తిగా దీనిని నమ్ముతున్నారు..