రాష్ట్రంలో వచ్చే 6మాసాల్లో పట్టణ ప్రాంతాల్లో 3లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో పట్టణ గృహనిర్మాణాలకు సంబంధించి స్టేట్ లెవెల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ(SLSMC)సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసమావేశంలో హౌసింగ్ ఫర్ ఆల్,బిఎల్సి కింద 8 అర్బన్ లోకల్ బాడీస్(ULB’s) మరియు 8 అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ(UDA’s)ల్లో పట్టణ గృహనిర్మాణ పధకాల కింద లక్షా 40వేల 559వేల ఇళ్ల నిర్మాణానికి ఈకమిటీ ఆమోదం తెలిపింది.ఈ సందర్భంగా సిఎస్ పునేఠ మాట్లాడుతూ వచ్చే ఆరు మాసాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పట్టణాల్లో 3లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు.పూర్తయిన ఇళ్ల సముదాయంలో వాటి నిర్వహణకు సంబంధించి స్థానిక లబ్దిదారులతో హౌసింగ్ ఎఇ లేదా డిఇఇ అధ్యక్షతన ఒక నిర్వహణా కమిటీని ఏర్పాటు చేయాలని సిఎస్ సూచించారు.దానివల్ల ఆయా గృహ సముదాయాల్లో ఎక్కైడైనా చిన్నపాటి మరమ్మత్తులు తలెత్తినా లేక తాగునీటి సరఫరాలో ఇబ్బందులు వంటివి ఏర్పడినా వాటిని ఆకమిటీ ద్వారా వెంటనే అలాంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.ఇందుకుగాను కొంత మొత్తాన్నిఆయా కమీటీల వద్ద అందుబాటులో ఉంచాలని సిఎస్ పునేఠ సూచించారు.పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణాలను వేగవంతం చేసేందుకు గాను వివిధ పట్టణాల్లో విస్తృతంగా పర్యటించి గృహ నిర్మాణాలకు ఎక్కడ భూమి లభ్యత ఇతర అంశాలు అనుకూలంగా ఉన్నాయనో పరిశీలించి సకాలంలో ఈప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలను,డిపిఆర్లను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించి సకాలంలో గృహాల మంజూరు పొందేందుకు కృషి చేయాలని సిఎస్ ఆదేశించారు.ఇందుకుగాను క్షేత్రస్థాయిలో మున్సిపల్ కమీషనర్లు,ఆర్డీఓలతో తరచు సమన్వయం కలిగి పట్టణ గృహనిర్మాణ పధకాలు వేగవంతంగా జరిగేలా చూడాలని ఎపిటిడ్కో ఎండిని సిఎస్ ఆదేశించారు.అంతకు ముందు ఎపిటిడ్కో ఎండి బియం దివాన్ మైదీన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ పట్టణాల్లో చేపట్టిన గృహనిర్మాణ పధకాల ప్రగతిని వివరించారు.పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం 3లక్షల గృహాల నిర్మాణాలు మొదలయ్యాయని వాటన్నిటినీ వచ్చే ఆరు మాసాల్లో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు సిసిఎల్ఏ మన్ మోహన్ సింగ్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కరికల వలవన్,గృహనిర్మాణ సంస్థ ఎండి మరియు కార్యదర్శి కాంతిలాల్ దండే,ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.