భారత ఆర్మీ జమ్మూ కశ్మీర్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలను ఏరివేయడంపై పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులైన కశ్మీర్ ప్రజలను భారత్ మట్టుపెడుతుందంటూ పిచ్చి వ్యాఖ్యలుచేశారు. దక్షిణ కశ్మీర్లో అదివారం జరిగిన ఎన్కౌంటర్ కారణంగా ఏడుగురు పౌరులు, జైషే మహ్మద్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. భారత ఆర్మీ అమాయక కశ్మీర్ ప్రజలను హత్య చేస్తోందంటూ పాక్ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ తీవ్రంగా స్పందించారు.
‘అక్రమిత కశ్మీర్లో అయాయక ప్రజలను భారత బలగాలు చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు ఇది సరైన సమయమని భారత్ అర్థం చేసుకోవాలి. కశ్మీర్ ప్రజల క్షేమం కోసం ఐక్యరాజ్యసమితి ద్వారా చర్చలకు వచ్చి సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమమంటూ’ ఇమ్రాన్ ట్వీట్ చేశారు. గత నెలలో న్యూయార్క్ వేదికగా భారత్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల మధ్య జరగాల్సిన సమావేశాన్ని భారత్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడులను ప్రోత్సహిస్తూనే శాంతి చర్చల వల్ల ప్రయోజనం చేకూరదని భారత్ అభిప్రాయపడుతోంది.
కాగా, తొలుత ఎన్కౌంటర్ చేయగా ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులను గుర్తించిన కాశ్మీర్ ప్రజలు కుల్గాం ఏరియా నుంచి తమ ఇళ్లకు వెళ్తుండగా జైషే గ్రూపు వద్ద ఉన్న గ్రెనేడ్ పేలడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు పాతిపెట్టిన గ్రెనేడ్ ఒక్కసారిగా పేలడంతో అమాయక ప్రజలు బలయ్యారని అదనపు డీజీపీ మునీర్ అహ్మద్ ఖాన్ వివరించారు.