శ్రీలంక సీనియర్ స్పిన్నర్ రంగనా హెరాత్ టెస్టు క్రికెట్కి వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్తో నవంబరు 6 నుంచి గాలే వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్.. తన కెరీర్లో ఆఖరిదని సోమవారం హెరాత్ ప్రకటించాడు. గాలే వేదికగా 1999లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్తో సుదీర్ఘ ఫార్మాట్లోకి అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్.. ఆ స్టేడియంలోనే రిటైర్మెంట్ తీసుకోబోతుండటం విశేషం. 19 ఏళ్ల కెరీర్లో మొత్తం 92 టెస్టులాడిన హెరాత్ 430 వికెట్లు పడగొట్టాడు.
శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అతని తర్వాత స్థానం హెరాత్దే. ప్రపంచవ్యాప్తంగానూ ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న బౌలర్లలో ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అండర్సన్ (564), స్టువర్ట్ బ్రాడ్ (433) తొలి రెండు స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో హెరాత్ కొనసాగుతున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమ చేతి వాటం బౌలర్ కూడా రికార్డుల్లో కొనసాగుతున్న హెరాత్.. గత ఎనిమిదేళ్ల కాలంలో శ్రీలంక జట్టు మొత్తం 81 టెస్టులు ఆడితే ఏకంగా 70 టెస్టుల్లో తుది జట్టులో ఉన్నాడు.