సోమవారం (అక్టోబరు 22) కూడా దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్ చివరకు నష్టాలతో ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ కూడా మంచి లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. సానుకూల అంతర్జాతీయ పరిణామాలతోపాటు.. ముడిచమురు ధరలు తగ్గే అవకాశాలు మార్కెట్లకు జోష్ ఇవ్వడంతో.. ఈ వారాన్ని సూచీలు లాభాలతో ప్రారంభించాయి. అయితే ఆ జోరు ఎంతోసేపు నిలువలేదు. మదుపర్ల అప్రమత్తతో మార్కెట్ ఆరంభమైన కొద్ది క్షణాల్లోనే సూచీలు ఆరంభ లాభాల్లో చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చాలా సేపు ఒడుదొడుకులకు లోనైన సూచీలు మధ్యాహ్న సమయానికి పూర్తిగా నష్టాల బాటపట్టాయి.
ట్రేడింగ్ చివరి అరగంటలో అమ్మకాలు భారీగా నెలకొనడంతో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. ముఖ్యంగా ఐటీ, విద్యుత్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు ఈ వారం డెరివేటివ్ కౌంటర్ ముగియనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమైనట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 181.25 పాయింట్ల నష్టంతో 34134.38, నిఫ్టీ 58.3 పాయింట్ల నష్టంతో 10245.25 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 73.44 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
ఎన్ఎస్ఈలో.. ఇండియాబుల్స్ హౌసింగ్ (+9.08), ఐషర్ మోటార్స్ (+3.70), ఐసీఐసీఐ బ్యాంక్ (+3.69), హెచ్సీఎల్ టెక్ (+2.25), ఎన్టీపీసీ (+2.11) షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంక్ (-8.07), బీపీసీఎల్ (-4.37), అల్ట్రాటెక్ సిమెంట్ (-4.05), రిలయన్స్ (-3.51), బజాజ్ ఫిన్సర్వ్ (-3.12) టాప్ లూజర్లుగా మిగిలాయి.