ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించవద్దని పాక్‌కు భారత్ సోమవారం తీవ్రంగా హెచ్చరిక చేసింది. ఆదివారం మధ్యాహ్నం పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్‌లోని సుందర్‌బానీ సెక్టార్ సరిహద్దు మీదుగా భారత్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలు కాగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు చొరబాటుదారులను హతమార్చిన భారత ఆర్మీ... ‘పాకిస్థాన్ నుంచి చొరబడిన వారి మృతదేహాలను తీసుకెళ్లమని ఆ దేశ ఆర్మీకి సమాచారం అందించాం. అలాగే, తమ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందేనని పాక్‌ను గట్టిగా హెచ్చరించాం’ అని భారత ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ ఏడాది మే 29న పాకిస్థాన్‌తో భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ చర్చలు జరిపిన అనంతరం కూడా పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని, అయినప్పటికీ చర్చల్లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తాము సరిహద్దుల వద్ద ఇప్పటివరకు వీలైనంత వరకు కాల్పులు జరపకుండా ఉంటున్నామని భారత ఆర్మీ తెలిపింది. ఉగ్రవాదులను ఎల్‌ఓసీ గుండా భారత్‌లోకి పంపేందుకు పాక్ ఆర్మీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ‘మే 30, 2018 నుంచి ఇప్పటివరకు మొత్తం ఏడుసార్లు ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో 23 మంది ఉగ్రవాదులు ఆర్మీ చేతిలో హతమయ్యారు’ అని తెలిపింది.కాగా, ఇటీవల ఆర్మీ ఉత్తర కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ కూడా ఇటీవల పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ప్రవేశించేలా ఆ దేశం ప్రోత్సహిస్తుందని, పాక్ తీరులో ఎటువంటి మార్పు లేదని ఆయన విమర్శించారు. భారత్ ఒక మెరుపు దాడి చేస్తే తాము 10 మెరుపుదాడులు చేస్తామని పాక్ ఆర్మీ చేసిన వ్యాఖ్యపై ఆయన స్పందిస్తూ... తాము అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని, దాడులు చేసే వాటిని తిప్పికొడతామని స్పష్టం చేశారు. కాగా, నిన్న జమ్ముకశ్మీర్‌లోకి మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్లు తెలుస్తోంది. భారత ఆర్మీ హతమార్చిన ఇద్దరు ఉగ్రవాదుల వద్ద రెండు ఏకే-47 తుపాకులు లభ్యమయ్యాయి. వారంతా సైనిక దుస్తుల్లో భారత్‌లోకి ప్రవేశించారు.