తిత్లీ ధాటికి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. 3 వేల ఎకరాల్లో జీడి తోటలు నాశనమయ్యాయి. మిశ్రమ తోటల పెంపకంలో భాగంగా పసుపును అంతర పంటగా వేయగా దానికి కూడా నష్టం వాటిల్లింది.అలాగే మామిడి, బొప్పాయి వంటి పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగింది. 500 ఎకరాల్లో పత్తి, 5 వేల ఎకరాల్లో ఫైనాపిల్, 300 ఎకరాల్లో అరటి, 200 ఎకరాల్లో కొండచీపర్లు, 200 ఎకరాల్లో కందికి నష్టం వాటిల్లిందినాయకులు, అధికారుల హడావుడంతా ఆ గ్రామాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అదే స్థాయిలో నష్టపోయిన మన్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. మైదాన ప్రాంతాల మాదిరిగానే సీతంపేట మన్యంలో భారీ నష్టం సంభవించింది. సుమారు 1500 ఇళ్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటిలో ఐదు వందల ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఇళ్లు, పంటలు, వివిధ రకాల ఆస్తినష్టం సంభవించి గిరిజనులు నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు విద్యుత్ పునరుద్ధరణ పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ ఆపత్కాలంలో సాయపడాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. కనీసం రేషన్ బియ్యం కూడా పంపిణీ చేయడం లేదని వాపోతున్నారు. . ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. సాయం అందాలంటే ఎకరాకు కనీసం 70 మొక్కలు ఉండి వీటిలో 35కుపైగా మొక్కలకు నష్టం వాటిల్లాలి. అది కూడా వేళ్లతో సహా పడిపోతేనే పరిహారం ఇస్తారు. 35 లోపు మొక్కలు పడిపోతే ఎలాంటి పరిహారం రాదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపును అంతర పంటగా సాగుచేస్తున్నందున దానికి కూడా పరిహారం రాదని చెప్పారని వాపోతున్నారు. కొండచీపుర్లకు కూడా పరిహారం అనుమానమేనని అంటున్నారు. తుపాన్ తర్వాత గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ జరిగిన దాఖలాలు లేవు. సీతంపేట ఏజెన్సీలో 450 గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో 400లకు పైగా గ్రామాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి. అలాగే గ్రామాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. నెట్‌వర్క్ ఎక్కడా లేదు. అత్యవసర సమయాల్లో 108కి ఫోన్ చేయాలంటే కాల్ కలవక ఇబ్బందులు తప్పడం లేదు.