YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నకిలీ బీమా ధ్రువీకరణలతో గోల్‌మాల్‌ 

నకిలీ బీమా ధ్రువీకరణలతో గోల్‌మాల్‌ 

- అత్తాపూర్‌ సంఘటనతో మరోసారి బట్టబయలు 
- మంత్రి ఆదేశాలు బేఖాతర్ 
వాహనాలకు చేసే బీమాలో పెద్దఎత్తున గోల్‌మాల్‌ జరుగుతోంది. నకిలీ బీమా ధ్రువ పత్రాలు అందించి చాలామంది వాహనదారులు చేతులు దులుపుకొంటున్నారు. మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్న రవాణాశాఖలోని కొందరు అధికారులు, సిబ్బందికి ఇవేవీ కన్పించడం లేదు. అత్తాపూర్‌ పరిధిలోని ఉప్పర్‌పల్లి ఆర్టీఏ కార్యాలయంలోని ఓ జిరాక్సు షాపులో ఎస్టీవో పోలీసుల దాడిలో పెద్దఎత్తున నకిలీ బీమా ధ్రువ పత్రాలు స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రేటర్‌ వ్యాప్తంగా గత కొన్నేళ్లుగా ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. గతంలో తిరుమలగిరి ఆర్టీవో పరిధిలో ఈ తరహా అక్రమాలు వెలుగులోకి రావడంతో రవాణా శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆ తరవాతా షరామామూలే.. ఈ అక్రమాలకు అడ్డుపడలేదని తాజాగా అత్తాపూర్‌ ఆర్టీఏ పరిధిలో జరిగిన సంఘటన తేటతెల్లం చేస్తోంది. ఈ అడ్డగోలు దోపిడీ అనేది బహిరంగ రహస్యమే. అయితే ఎవరి స్థాయిలో వారికి మామూళ్లు అందుతుండటంతో బయటకు పొక్కడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.

గ్రేటర్‌లో పరిధిలోని తిరుమలగిరి, మలక్‌పేట, బండ్లగూడ, మోహిదీపట్నం, ఇబ్రహీంపట్నం, ఉప్పల్‌, మేడ్చల్‌, అత్తాపూర్‌, కొండాపూర్‌ తదితర ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో సామర్థ్య పరీక్షల్లో విచ్చలవిడిగా అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు గతం నుంచి ఆరోపణలు ఉన్నాయి. పేరుకే ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తున్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. చేతులు తడపనిదే పనులు సాగడం లేదని వాహనదారులు వాపోతున్నారు. పాఠశాల బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు ఇతర ప్రజా రవాణాకు వినియోగించే వాహనాలు ఏటా తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ తీసుకోవాలి. ఇందుకు కాలుష్య ధ్రువీకరణ, థర్డ్‌ పార్టీ బీమా ధ్రువీకరణ అందించాలి. బస్సులు ఇతర పెద్ద వాహనాలను పక్కన పెడితే ఆటోలు, సరకు తరలించే ట్రాలీలు, క్యాబ్‌లు, విద్యా సంస్థల వ్యాన్‌లు తదితర చిన్నపాటి వాహనాల ఫిట్‌నెస్‌ ధ్రువీకరణల్లో అసలు నిబంధనలు పరిగణలోకి తీసుకోవడం లేదు. అడిగినంత చేతిలో పెడితే చాలు పరీక్షలు చేసినట్లు చూపి ధ్రువీకరణ పత్రం చేతిలో పెడుతున్నారు. బండ్లగూడ, మెహిదీపట్నం, కొండాపూర్‌, ఉప్పల్‌, ఇబ్రహీంపట్నం, అత్తాపూర్‌ ఆర్టీఏ కార్యాలయాల్లో పరిధిలో విచ్చలవిడి అక్రమాలు జరుగుతున్నాయి.

అక్రమాలు ఇలా... 
* గ్రేటర్‌లో 47 లక్షల వాహనాలు ఉన్నాయి. నిత్యం వందలాది వాహనదారులు తమ వాహనాల ఫిట్‌నెస్‌ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటున్నారు. ప్రతి వాహనాన్ని ఆయా కేంద్రాలకు తరలించాలి. చాలా వరకు ఫిట్‌నెస్‌ కేంద్రాలకు వెళ్లకుండానే ధ్రువీకరణ ఇచ్చేస్తున్నారు. 
* సామర్థ్య ధ్రువీకరణ చేయాలంటే ప్రతి వాహనానికి బీమా, కాలుష్య ధ్రువీకరణ అవసరం.  ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఇదే కాపాడుతుంది. ప్రస్తుతం వాహనానికి బీమా లేకపోయినా సరే ధ్రువీకరణ ఇచ్చేస్తున్నారు. బీమా మొత్తం చెల్లించడానికి ఇష్టం లేక చాలామంది ఈ తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. 
* ఆన్‌లైన్‌లో జిమ్మిక్కులు చేస్తున్నారు. వేరే వాహనదారుల పాలసీ నంబర్లు ఎంట్రీ చేసి పని కానిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఉన్న లోపాలను అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అనేక బీమా కంపెనీలు ఉండటం వల్ల వాటి మధ్య సమన్వయం ఉండటం లేదు. పాత పాలసీ నంబరు వేసినా ఆన్‌లైన్‌లో ఇబ్బందులు తలెత్తడం లేదు. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని పని కానిస్తున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చేతిలో పెడుతున్నారు. వీటిని ఆర్టీఏ అధికారులు గుడ్డిగా తీసుకుంటున్నారు. 
* బస్సు నుంచి ఆటో వరకు ప్రతి వాహనం ఫిట్‌నెస్‌ కోసం ఆన్‌లైన్‌లో నిర్ణీత ఫీజులు చెల్లించాలి. లోపాలను చూసీచూడనట్లు విడిచిపెట్టాలంటే ఆర్టీఏ సిబ్బంది చేతిలో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పెట్టాల్సిందే. 
* ఈ వాహనాలు సరైన ఫిట్‌నెస్‌ లేక ప్రమాదాలకు గురవుతున్నాయి. అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయి. థర్డ్‌ పార్టీ బీమా లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 
* నగరంలో 70 వేల ఆటోలకు యజమానులు ఎవరో తెలియదు.

గ్రేటర్‌లో వాహనాలు ఇలా... 
ఆటోలు- 1,45,607 
మోటారు క్యాబ్‌లు- 60,104 
గూడ్స్‌ వాహనాలు- 2,08,038 
కాంట్రాక్ట్‌ క్యారేజ్‌లు- 5190 
విద్యా సంస్థల బస్సులు- 11,475 
మ్యాక్సీ క్యాబ్‌లు- 14,951

Related Posts