YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జాతీయ పార్టీ హోదా కోసం నారా ప్లాన్

జాతీయ పార్టీ హోదా కోసం నారా ప్లాన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పొరుగు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఎందుకంత అమితాసక్తి చూపుతున్నారు..? తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిని అడ్డుకునేందుకు ఎందుకంత పట్టుదలతో పనిచేస్తున్నారు? టీఆర్ఎస్ ను ఓడించేందుకు బద్ధ శత్రువైన కాంగ్రెస్ తో ఎందుకు కలిసి నడుస్తున్నారు? టీఆర్ఎస్ ను ఓడించడం వల్ల రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం ఏంటి? కాంగ్రెస్ తో పొత్తు ద్వారా గెలిచే కొద్దిపాటి స్థానాలతో రాజకీయంగా ఇక్కడ ఏం చేయగలుగుతారు? ప్రస్తుతం ఇవీ సగటు రాజకీయ విశ్లేషకులకు ఎదురవుతున్న ప్రశ్నలు. వీటిని ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషిస్తుంటారు. భాష్యాలు చెబుతుంటారు. కానీ తరచి చూస్తేనే ఏపీ ముఖ్యమంత్రి అంతరంగం అర్థమవుతుంది. ఎత్తులు, పైఎత్తులు వేయడం, రాజకీయ వ్యూహరచనలో దిట్ట, నాలుగు దశాబ్బాల అనుభవం గల నారా చంద్రబాబునాయుడు ే పనిచేసినా ముందుచూపుతో, దూరాలోచనతో చేస్తారు. ఇప్పుడు తెలంగాణ లో పోటీ చేయడంలోనూ అటువంటి ఉద్దేశ్యమే దాగి ఉంది. వాస్తవానికి తెలంగాణలో పోటీ చేయడం వల్ల ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ ను నియంత్రించడం అంత తేలిక కాదు. రాజకీయంగా బద్ధ శత్రువలైన కాంగ్రెస్ తో కలసినంత మాత్రాన ప్రత్యేకంగా వచ్చే లాభం లేదు. అన్నింటికీ మించిన ఒక అంశం ఉంది. తెలుగుదేశం పేరుకు ప్రాంతీయ పార్టీ అయినా, ఒక రాష్ట్రానికే పరిమితమే అయినా సాంకేతికంగా టీడీపీ జాతీయ పార్టీ. ఆ పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు. ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నారాలోకేష‌ జాతీయ ప్రధాన కార్యదర్శి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంతో పాటు దాదాపు 15 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. రంగారెడ్డి, హైదరాబాద్ నగర శివార్లలో ఆంధ్రులు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. ఒక రాష్ట్రంలో పూర్తిస్థాయి మెజారిటీ, మరో రాష్ట్రంలో కనీస ప్రాతినిధ్యం లభించడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆ గుర్తింపును కాపాడుకోవాలంటే మళ్లీ ఆ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. హైదరాబాద్ నగర పాలకసంస్థ ఎన్నికల్లోనే ఈ విషయం స్పష్టమైంది. అంతకుముందే ఆ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు, ఏకైక ఎంపీ మల్లారెడ్డి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా టీడీపీ ఇక్కడ నామ్ కే వాస్తే అయింది. దీంతో ఒంటరిగా పోటీ చేస్తే మిగిలేది ఏమిటో స్పష్టంగా అర్థమయింది. అందుకే పొత్తుల కోసం తాపత్రయపడింది. ఇందుకోసం ముందుగా టీఆర్ఎస్ తలుపు తట్టింది. రాజకీయంగా మాయల మరాఠీ అయిన కె.చంద్రశేఖర్ రావు అసలు విషయాన్ని గ్రహించి నో చెప్పారు. దీంతో గత్యంతరం లేక హస్తం పార్టీ పంచన టీడీపీ చేరింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలన్నా, ఆ గుర్తింపును కాపాడుకోవాలన్నా కొన్ని నిబంధనలు పాటించాలి. ఈ మేరకు ఒకటికన్నా ఎక్కువ రాష్ట్రాల్లో నిర్ణీత సంఖ్యలో సీట్లు, ఓట్లు రావడం తప్పనిసరి. మూడు రాష్ట్రాల్లో కనీసం 11 ఎంపీ సీట్లు సాధించాలి. లేదా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు రావాలి. గౌరవప్రదమైన స్థానాలు రావడంతో గతంలో టీడీపీకి జాతీయ పార్టీ గుర్తింపు లభించింది. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు. సొంతంగా పోటీ చేస్తే నాటి సీట్లు, ఓట్లు రానేరావు, ఆంధ్రులు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో విజయం తనదేనని ధీమాగా చెప్పుకునే పరిస్థిితి లేదు. 2014 ఎన్నికల మాదిరిగా ఆంధ్రులంతా గంపగుత్తగా టీడీపీకే వేస్తారన్న గ్యారంటీ ఏమీలేదు. వీరిలో కొంతమంది టీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉన్నారు. మరి కొంతమంది ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు మద్దతుదారులుగా మారారు. కొంతమంది టీడీపీ వైపే ఉన్నప్పటికీ ఆ కొద్దిపాటి బలంతో సైకిల్ పార్టీకి ఒరిగేదేమీ ఉండదు. అదే హస్తం పార్టీతో కలసి ప్రయాణిస్తే ఎంతో కొంత లబ్ది చేకూరుతుందన్నది ఏపీ అధినేత అంతరంగం. ఈ ముందుచూపు, దూరదృష్టితోనే ఒకప్పుడు రాజకీయంగా తనకు జన్మనిచ్చిన,ప్రస్తుతం బద్ధ శత్రువైన హస్తం పార్టీతో జట్టు కట్టారు. ఇక్కడ గౌరవ ప్రదమైన ఓట్లు, సీట్లు సాధించినా ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఒకవేళ టీఆర్ఎస్ ఒడితే దాని ప్రభావం అక్కడ మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్లే పొత్తుకు ముందుకొచ్చారు. అంతేతప్ప హస్తం పార్టీపై అభిమానమో, టీఆర్ఎస్ పై ద్వేషంతోనో కాదు. 2014 లోక్ సభ ఎన్నికల్లో తగినన్ని ఓట్లు, సీట్లు రాక కొన్ని జాతీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ నుంచి శ్రీముఖాలు వచ్చాయి. మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ), శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), సీపీఐ వంటి పార్టీలు ఇందులో ఉన్నాయి. జాతీయ పార్టీలుగా వీటి గుర్తింపు ఎందుకు రద్దు చేయరాదంటూ ఎన్నికల కమిషన్ గతంలో నోటీసులు పంపింది. గత ఎన్నికల్లో 4.1శాతం ఓట్లతో బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ తర్వాత మూడోస్థానంలో నిలిచింది. కానీ ఒక్క ఎంపీ స్థానంలోనూ గెలవలేదు. ఎన్సీపీ 1.6 శాతం ఓట్లతో ఆరు లోక్ సభ, సీపీఐ 0.8 శాతంఓట్లతో ఒక ఎంపీ స్థానాన్ని గెలిచాయి. దీంతో ఈసీ తాఖీదు పంపంది. ఈ భయంతోనే మాయావతి రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటుంది. జాతీయ పార్టీగా ఉంటే చట్టపరంగా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. జాతీయ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి ఒక ప్రతిపాదకుడు సరిపోతాడు. రెండు సెట్ల ఓటర్ల జాబితాలను ఉచితంగా ఈసీ నుంచి పొందవచ్చు. ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రచారానికి సమయం కేటాయిస్తారు. సాధారణ ఎన్నికల్లో 40 మంది “స్టార్ కాంపెయినర్ల”ను నియమించుకునే అవకాశం ఉంటుంది. వీరి ప్రచార వ్యయాన్ని ప్రశ్నించే అధికారం ఉండదు. అఖిలపక్ష సమావేశాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారిక ఆహ్వానాలుంటాయి. పలు రాయితీలు ఉంటాయి. అందువల్లనే చిన్న పార్టీలు కూడా జాతీయ పార్టీగా గుర్తింపు కాపాడుకోవడానికి తాపత్రయపడతాయి. ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి ఇదే.

Related Posts