మొన్న జగన్... నిన్న పవన్ లపై విరుచుకుపడుతూ టీడీపీ ఫైర్ బ్రాండ్ గా మారుతోంది యామినీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు యామిని సాధినేని. ఏపీ నైపుణ్యాభివృద్ధి కమిటీ మెంబర్‌గా కొందరికే తెలిసిన యామిని.. పలు సమాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే, మరోవైపు వ్యాపార, రాజకీయ రంగాల్లో తనదైన ముద్రను వేస్తున్నారు. పలు సందర్భాల్లో తెలుగుదేశం పార్టీని విమర్శించిన వారిపై సోషల్ మీడియా వేదికగా ఈమె అదిరిపోయే కౌంటర్లు ఇచ్చారు. ఇటీవల తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ సభలో ఏపీ సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలపై కూడా స్పందించిన యామిని, ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ బాగా పాపులర్ అయ్యారు. దీని ద్వారా ఆమె చంద్రబాబు దృష్టిలో పడ్డారు. యామిని టాలెంట్‌ను గుర్తించిన ఏపీ సీఎం చంద్రబాబు ఆమెను టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు. గుంటూరుకు చెందిన యామిని ప్రత్యర్థులకు కౌంటర్లు ఇస్తూ వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అందుకే ఈమె పేరు ఇప్పుడు ఏపీలోనే కాకుండా తెలంగాణలో సైతం మారుమ్రోగిపోతుంది. ఇటీవల ఆమె జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తితలీ బాధితులను పరామర్శించకుండా కవాతు నిర్వహించడం.. అందులో చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలు చేయడంపై మాట్లాడిన యామిని.. ‘‘పావలాకు కూడా పని చేయని పవన్ కల్యాణ్.. రెండు వేల నోటు లాంటి లోకేష్ గారి గురించి మాట్లాడడం హాస్యాస్పదం. కవాతు సభలో తాట తీస్తాం.. తోలు తీస్తాం.. అని మాట్లాడారు. ఎవరి తాట తీస్తారు..? ఎవరి తోలు తీస్తారు..? మీరు కూర్చుని మల్లెపూలు నలపడం తప్ప ఏమీ చేయలేరు’’ అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై పవన్ అభిమానులు యామినిపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. అంతేకాదు, ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత మాధవి లత సైతం ఆమెకు కౌంటర్ ఇచ్చారు. ఇది ఇంకా కొనసాగుతూనే ఉండగా ఇంతలో ఈ వ్యవహారానికి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకొచ్చింది. యామినిని కావాలనే ఓ వర్గం టార్గెట్ చేస్తున్నదన్నదే దాని సారాంశం. టీఆర్ఎస్, వైసీసీ అభిమానులు సైతం పవన్ ఫ్యాన్స్‌లా ఖాతాలు క్రియేట్ చేసి ఆమెపై ఘోరమైన కామెంట్లు చేస్తున్నారని సమాచారం. మరి ఈ వ్యవహారానికి ఎప్పటికి బ్రేక్ పడుతుందో చూడాలి.