YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సెంటిమెంట్ కు చెక్ పెట్టే యోచనలో షా

 సెంటిమెంట్ కు  చెక్ పెట్టే యోచనలో  షా
అత్యంత కీలకమైన రాజస్థాన్ ను చేజిక్కించుకునేందుకు రెండు ప్రధాన పార్టీలూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. రాజస్థాన్ లో ఉన్న సెంటిమెంట్ ను కూడా ప్రధానంగా రెండు పార్టీలూ పరిగణనలోకి తీసుకుంటున్నాయి.మరో వైపు రాజస్థాన్ లో సెంటిమెంట్ ఎక్కువ. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి అధికారంలోకి రావడం కద్దు. అలాగే ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరోసారి గెలవడం అరుదు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలవడం మహా కష్టమని గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు తేల్చి చెబుతున్నాయి. దీంతో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను వీలయినంత మందికి టిక్కెట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి.2008, 2013 ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని మరీ పార్టీలు వ్యూహరచన చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి పీఠాన్ని చేజిక్కించుకోవాలని చూస్తుండగా, తామే విన్నర్లమంటూ హస్తం పార్టీ ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. నెక్ టు నెక్ పోరు ఉంటుందనుకున్నామని, వార్ వన్ సైడ్ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా నొక్కి చెబుతున్నారు.ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి తిరిగి టిక్కెట్ ఇస్తే గెలవరన్నది కమలం పార్టీ సెంటిమెంట్ గా భావిస్తోంది. అందుకే సిట్టింగ్ లకు నో చెప్పి చరిత్ర తిరగరాయాలని చూస్తోంది.ఎన్నికల్లో 200 అసెంబ్లీ స్థానాలకు 160 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో మాత్రం సిట్టింగ్ లలో వంద మంది వరకూ గెలవడం కష్టమేనని తేలిపోయింది. ఇందులో మంత్రులు కూడా ఉండటం విశేషం. మంత్రులపైన కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలో వెల్లడయింది. దీంతో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి వసుంధర రాజేను పట్టించుకోవడం మానేశారు.గత ఎన్నికలను ఒకసారి విశ్లేషిస్తే 2008 ఎన్నికల్లో 68 మంది సిట్టింగ్ లకు టిక్కెట్ ఇస్తే 40 మంది ఓటమి పాలయ్యారు. 2013 ఎన్నికల్లో 105 మందికి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ లకు టిక్కెట్ ఇస్తే అందులో 14 మంది మాత్రమే విజయం సాధించారు. అంటే 91 మంది ఓటమి పాలయ్యారన్న మాట. ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే తిరిగి గెలవరని చరిత్ర చెబుతుండటంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కూడా సిట్టింగ్ ల చీటీ చింపేయాలన్న నిర్ణయానికి వచ్చింది. దాదాపు వంద మంది వరకూ టిక్కెట్ ఇవ్వకుండా, కొత్త ముఖాలను రంగంలోకి దించాలన్నది కమలం పార్టీ వ్యూహం. మరి ఇది ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

Related Posts