YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

స్వైన్ కలకలం..

 స్వైన్ కలకలం..
 సీజన్ మారిందంటే వైరల్ ఫీవర్స్ సాధారణమైపోయాయి. పలువురిని జ్వరాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు అనారోగ్య సమస్యలకు దారితీయడం సహజమే. అయితే కొంతకాలంగా మొండి జ్వరాలు ప్రజలను వేధిస్తున్నాయి. ప్రధానంగా డెంగ్యూ, స్వైన్ ఫ్లూ లాంటివి జనాలను వణికించేస్తున్నాయి. దీంతో సీజన్ మారుతోందంటేనే అంతా వణికిపోతున్నారు. కర్నూలు జిల్లాలోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. శీతాకాలం ప్రారంభం కావడంతో వైరల్ ఫీవర్స్ చుట్టుమడుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే అనేకమంది జ్వరాల బారినపడ్డారు. ఇదిలాఉంటే స్థానికంగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతుండడంతో జనాలు హడలిపోతున్నారు. జలుబు లక్షణాలతో ప్రారంభమయ్యే ఈ అనారోగ్యం ప్రాణాపాయానికి దారి తీస్తోంది. దీంతో చిన్నపాటి అనారోగ్యమే అయినా సత్వరమే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ జలుబు, జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు సజావుగా సాగడంలేదు. డ్రైనేజ్‌ వ్యవస్థ కూడా సరిగా లేదు. వీధుల్లోనే చెత్త నిలిచిపోతోంది. ఇక మురుగునీరూ రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో దోమలు, క్రిమికీటకాదులు ప్రబలి జనాలపై దాడి చేస్తున్నాయి. ఫలితంగా జనాలకు సమస్యలు తప్పడంలేదు. ప్రజల అజాగ్రత్తలు, ఏమరుపాటు కూడా అనారోగ్య సమస్యలకు తావిస్తోంది. అందుకే అప్రమత్తంగా వ్యవహరిస్తే వ్యాధులకు కొంత దూరంగా ఉండొచ్చని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. 
ఇంటినే కాక ఇంటి పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీళ్లు, చెత్త నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇళ్ల పరిసరాల్లో పిచ్చిమొక్కలు లేకుండా.. మొక్కలు ఉంటే దోమలు, కీటకాలు వాటి దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాచివడపోసిన నీటినే సేవించాలి. బయటి ఆహారపదార్ధాలు అస్సలు తినకూడదు. ఇక బయటకు వెళ్లినప్పుడు ముక్కుకు మాస్క్ ధరించడం మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వైరల్ ఫీవర్స్‌కు కొంచెం దూరంగా ఉండొచ్చు. ఇదిలాఉంటే జిల్లాలో పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు సజావుగా సాగడంలేదు. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాల్సి ఉందని ప్రజలు అంటున్నారు. ఈ విభాగంలో నిర్లక్ష్యం కొనసాగితే ప్రజారోగ్యం తీవ్రంగా ప్రభావితమవడం ఖాయమని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత సిబ్బంది తక్షణమే స్పందించి పారిశుద్ధ్య పనులు చిత్తశుద్ధితో చేపట్టాలని కోరుతున్నారు. వైద్య విభాగమూ అప్రమత్తంగా ఉండాలని బాధితులందరికీ సమర్ధవంతమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఔషదాలకు కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. మరోవైపు వైరల్ ఫీవర్స్ విజృంభిస్తుండడంతో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మంచి వైద్యం లభిస్తుందన్న ఆశతో పలువురు ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారికి చికిత్స నిమిత్తం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారు. మొత్తంగా వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. 

Related Posts