- అంచనా వ్యయం రూ.౭౦౦ కోట్లు
- మార్గం వెడల్పు..20 మీటర్లు
- పొడవు.. ౫౦౨౯ మీటర్లు
సొరంగ మార్గానికి మార్గం సుగమమైంది. హైటెక్‌సిటీ కేంద్రంగా రాబోతున్న మరో అందమైన నిర్మాణం ఇది. సొరంగమార్గం పూర్తయ్యాక ఆ రహదారి ఉక్కు వంతెనతో అనుసంధానం అవుతుంది. రెండింటినీ కలిపితే నిర్మాణం అర కిలోమీటరు పొడవు ఉంటుంది. ఫలితంగా ఖాజాగూడ కూడలి ఆకర్షణీయంగా తయారవుతుంది. ఇనార్బిట్‌మాల్ నుంచి బాహ్యవలయ రహదారి వెళ్లాలనుకునేవారికి ఈ మార్గంతో 2 కి.మీ. ప్రయాణం కలిసొస్తుంది.
మహా నగరంలో సౌకర్యవంతమైనవే కాదు... ఆకర్షణీయమైన, అందమైన రహదారులు రావాలనేది రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లక్ష్యం. అందుకు తగ్గట్లు ఆయన హైటెక్‌సిటీపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణాలకు దీటుగా సుందరమైన రహదారి సోయగాలను ఆవిష్కరించాలని ఇంజినీర్లు, పలు ప్రఖ్యాత కన్సల్టెన్సీలతో రెండేళ్లపాటు అధ్యయనం చేయించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన నిపుణుల బృందాలు పలు సూచనలతో ముందుకొచ్చాయి. దుర్గం చెరువుపై మొదలైన తీగల వంతెన నిర్మాణం, మైండ్‌స్పేస్ కూడలిలో జరుగుతోన్న గ్రేడ్ సపరేటర్ల పనులు, బయోడైవర్సిటీ కూడలి దగ్గర బహుళస్థాయి పైవంతెనలు, శిల్పారామం కూడలి దగ్గర బహుళ స్థాయి పైవంతెనలు, అయ్యప్ప సొసైటీ కూడలి దగ్గర అండర్‌పాస్ నిర్మాణం, తదితర ప్రాజెక్టులు ఆయా సూచనల్లోనివే. అవన్నీ ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. అయ్యప్పసొసైటీ కూడలి దగ్గర అండర్‌పాస్ నిర్మాణం ఎప్పుడో పూర్తయిందని, వాహనదారులకు కూడలి వద్ద ట్రాఫిక్ కష్టాలు లేకుండా పోయాయని ముఖ్య ఇంజినీరు శ్రీధర్ తెలిపారు. మంత్రి సూచనతో ఇనార్బిట్ మాల్ నుంచి ఖాజాగూడకు నేరుగా రహదారి వేసేందుకు అధ్యయనం చేశామని, అక్కడున్న కొండను తొలిచి సొరంగ మార్గానికి ప్రతిపాదించామని సీఈ శ్రీధర్ అన్నారు.
ప్రకటన విడుదల చేసిన సర్కారు
‘మొదట సొరంగ మార్గం పూర్తవగానే పైవంతెనను మొదలుపెట్టి ఆ మార్గాన్ని బాహ్యవలయ రహదారి వరకు తీసుకెళ్లాలని అనుకున్నాం. అందుకు రూ.1,500 కోట్లు అవసరం అవుతుంది. ఒకేసారి అంత వ్యయం చేయడం కష్టంగా ఉంటుందని ముందుగా సొరంగమార్గం వరకు పనులు చేపట్టాలనుకున్నాం. ప్రతిపాదనల్లో స్వల్ప మార్పులు చేస్తున్నాం. సర్కారు ఇప్పటికే సొరంగమార్గం పనులు చేపట్టడంపై ట్రాన్సాక్షన్ అడ్వైజర్ నియామకానికి ప్రకటన విడుదల చేసింది. ఆ సలహాదారు ప్రాజెక్టు వ్యయం, ఇతరత్రా అంశాలను బేరీజు వేసి నివేదిక ఇస్తారు. తద్వారా సర్కారు ముందడుగు వేస్తుంది’ అని ఓ సీనియర్ ఇంజినీరు తెలిపారు.
మార్గం పొడవు 502.9 మీటర్లు
ఇనార్బిట్‌మాల్ ఎదురుగా హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్ అభివృద్ధి అవుతోంది. అక్కడ నిర్మాణాలు పూర్తయితే ఆ ప్రాంతంలో జనసాంద్రత పెరుగుతుంది. అందువల్ల హెచ్‌కేసీకి సాధ్యమైనన్ని దారులను అనుసంధానించాలనేది మంత్రి కేటీఆర్ ప్రణాళిక. అందులో భాగంగానే ఆయన ఖాజాగూడ కూడలిని ఇనార్బిట్‌మాల్ రోడ్డుతో కలపాలనుకున్నారు. ప్రస్తుతం ఇనార్బిట్‌మాల్ నుంచి ఖాజాగూడ కూడలి వెళ్లాలంటే దాదాపు 2.5 కి.మీ. ప్రయాణించాలి. మాల్ ఎదురుగా ఉన్న కొండను తొలిచి సొరంగమార్గం నిర్మిస్తే ఆ దూరం 300 మీటర్లకు తగ్గుతుంది. కూడలి అవతల మరో 200 మీటర్ల మేర వంతెనను పొడిగించి నానక్‌రామ్‌గూడ రోడ్డుపై దించుతామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. ఈ వంతెనపై ఇరువైపులా రాకపోకలు ఉంటాయి. సాంకేతికంగా వచ్చి పోయే వాహనాలకు కలిపితే రెండు సొరంగ మార్గాలు ఉంటాయని చెప్పాలి. కొండ లోపల వచ్చే మార్గం పొడవు దాదాపు 250 మీటర్లు ఉంటుందని, మిగిలిన వంతెన ఉక్కుతో నిర్మాణం అవుతుందని అధికారులు చెబుతున్నారు. రెండింటినీ కలిపితే వంతెన 502.9 మీటర్ల మేర ఉంటుందన్నారు.