దేశంలో బాణసంచాను పూర్తిగా నిషేధించలేమని అత్యన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. అయితే, బాణసంచా కాల్చడంపైనా మాత్రం అంక్షలు విధించింది. పలువురు న్యాయవాదులు, ప్రజాసంఘాలు బాణసంచా అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని సుప్రీంకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారించిన ధర్మాసనం, మంగళవారం తీర్పును వెలువరించింది. బాణసంచా కాల్చడం ద్వారా వాయుకాలుష్యంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందంటూ పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్భూషణ్ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపి ఆగస్టు 28న తీర్పును రిజర్వు చేసింది. సెంటిమెంట్ తో ముడిపడిన దీపావళి, బాణసంచా అమ్మకాలను పూర్తిగా నిషేధించే ఉద్దేశం తమకు లేదని కోర్టు ఈ సందర్బంగా వ్యాఖ్యానించింది. లైసెన్స్ ఉన్న వ్యాపారులే బాణసంచా అమ్మాలి.. ఆన్లైన్లో బాణసంచా అమ్మకాలు జరపొద్దని కోర్టు స్పష్టం చేసింది. అయితే, దీపావళి నాడు సాధ్యమైనన్ని తక్కువ బాణసంచా కాల్చుకునేలా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించింది. బాణసంచా తయారీ పరిశ్రమలపై ఆధారపడి వేల కుటుంబాలు బతుకుతున్నాయని, వీరికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపకుండా అమ్మకాలను నిషేధించలేమని పేర్కొంది. ఆన్ లైన్ లో బాణసంచా అమ్మకాలు జరపరాదని కోర్టు ఆదేశించింది. దీపావళి రోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు బాణాసంచాలను కాల్చేందుకు అనుమతించింది. అలాగే క్రిస్మస్, న్యూ ఇయర్ రోజు రాత్రి 11.45 నుంచి గంటపాటు అనుమతినిచ్చింది. గత యేడాది దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా నిషేధాన్ని విధించిన సంగతిని ప్రస్తావిస్తూ, కాలుష్య మార్పులను తెలుసుకునేందుకే ఆ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. గత మూడు సంవత్సరాల వ్యవధిలో దీపావళి ముందు, ఆ తరువాత ఢిల్లీలో కాలుష్యంపై పూర్తి నివేదికలు సమర్పించాలని ఢిల్లీ అధికారులను ఆదేశించింది.