విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్ లో మంగళవారం నిర్వహించిన ఫిన్ టెక్-2.ఓ సదస్సులో పలు కంపెనీల సీఈవోలు, అధినేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత యాంత్రిక వ్యవస్థను అమలు చేస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధికి, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడే ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించామన్నారు. హైదరాబాద్ తరహాలోనే విశాఖపట్నంను తీర్చిదిద్దేందుకు 2016లో ఫిన్ టెక్ సదస్సును వైజాగ్ లో ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు. సాంకేతిక రంగంలో ప్రపంచంలోనే టాప్-4 సాఫ్ట్ వేర్ నగరాల్లో ఒకటిగా విశాఖపట్నం నిలుస్తుందని చెప్పారు. చల్లటి వాతావరణం, వేసవి రిసార్టులు విశాఖకు సహజ ఆభరణాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం నవకల్పన, ఇంకుబేషన్, స్టార్టప్ ల వైపు నడుస్తోందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ సమస్యలు, సవాళ్లను సాంకేతికతల ద్వారా అధిగమించామని చంద్రబాబు అన్నారు. నదీజలాలు, భూగర్భ జలాలు, భూసారము, పర్యావరణము, విద్యుత్తు, రవాణా, నైపుణ్యం కలిగిన మానవ వనరులు మొదలైన అంశాలను ఈ-ప్రగతి ద్వారా అనుసంధానించి అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తున్నామన్నారు.
రాష్ట్రాన్ని పూర్తిగా ఇన్నోవేషన్ వ్యాలీగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం. అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి దీటుగా ఏపీని తీర్చిదిద్దుతామని చంద్రబాబు వెల్లడించారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దానికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. వారికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం ఇస్తుందన్నారు. తిరుపతి-చెన్నై-కృష్ణ పట్నం ప్రాంతం సిలికాన్ కారిడార్ లో ప్రస్తుతం 30 శాతం ఫోన్లు తయారవుతున్నాయని తెలిపారు. దీన్ని 60 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు.