సీబీఐ లుకలుకలు బయటపడుతున్నాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరులతో మాట్లాడుతూ.. సీబీఐని బ్రష్టు పట్టించారని, దర్యాప్తు సంస్థలను తమ పనులను చేసుకోనివ్వడం లేదని మండిపడ్డారు. అన్నారు. టీడీపీ నాయకులకు ఈ రోజే సీబీఐ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. సీబీఐని తమకు నచ్చని వారిపై ఉసిగొల్పుతున్నారని ఆ రోజే తాము చెప్పామని గుర్తు చేశారు. ఆ రోజు సీబీఐ మూడో కన్ను..ఈ రోజు మీ జోలికి వస్తే ఛీబీఐయా అని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సీబీఐ..ఛీబీఐ అయ్యిందా అని సూటిగా అడిగారు.ఈడీ దర్యాప్తు సంస్థలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తాబేదారులు ఉన్నారని, ఆ రోజే కేంద్రానికి వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబుపై సీబీఐకి ఫిర్యాదు చేస్తే కోర్టుకి వెళ్లే వరకు ఏం చేయలేదని తెలిపారు. సీబీఐని బ్రష్టు పట్టించిన వ్యక్తుల నిగ్గు తేలాల్సి ఉందన్నారు. తుపాను బాధితులకు సహాయ చర్యలు భేష్ అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, బాబుకు కితాబు ఇవ్వడంతోనే వాళ్ల బంధం తేటతెల్లం అవుతోందని విమర్శించారు.ఆ రోజు వైఎస్ జగన్ కేసులో మీడియాకు ఫోజులు ఇచ్చిన జేడీ..ఈ రోజు చంద్రబాబుకు కితాబు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సీబీఐలో జరుగుతున్న బాగోతాలను, లుకలుకలను బయటకు తెచ్చి, అన్ని కేసుల విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కోరారు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ సిద్ధమని ప్రకటించారు.