YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మద్యం ఏరులు

మద్యం ఏరులు
జిల్లాలో మద్యం బెల్టు షాపు లేని గ్రామం ఉండదు. పల్లె నుంచి పట్టణం వరకు వీధివీధినా విచ్చలవిడిగా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 75 అధికారిక దుకాణాలు, 13 బార్‌ల ద్వారా మద్యం విక్రయాలు సాగుతుండగా వీటికి సమాంతరంగా గొలుసు దుకాణాలు 500 వరకు నడుస్తున్నాయి. మొత్తమ్మీద ప్రతి నెలా రూ.30 కోట్ల వ్యాపారం సాగుతోంది. మద్యం దుకాణాలకు అనుబంధంగా కొన్ని.. ఎవరితో సంబంధం లేకుండా నిర్వాహకులే స్వయంగా కొనుగోలు చేసి గ్రామాల్లో విక్రయించేవి మరికొన్ని గొలుసు దుకాణాలున్నాయి. పలువురు వ్యాపారులు స్థానిక పోలీసులకు, కొంత మంది ఆబ్కారీ పోలీసులకు నెలనెలా మామూళ్లు ఇస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం రూ.30 కోట్ల వ్యాపారంలో గొలుసు దుకాణల ద్వారా కనీసం రూ.10 కోట్ల వరకు అమ్మకాలు సాగుతుంటాయి. మండలకేంద్రాలతో పాటు పెద్ద గ్రామాల్లో అనుమతి పొందిన దుకాణాలుండగా, చిన్న చిన్న గ్రామాలు, అనుబంధ పల్లెల్లో మద్యం అందుబాటులో ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకొని పలువురు పట్టణాల నుంచి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు గ్రామాల్లో విక్రయిస్తున్నారు. సాధారణ ధర కంటే 20 శాతం ఎక్కువగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో పంచాయతీలకు నెలకు కొంత చొప్పున సొమ్ము చెల్లించి గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నారు.
గ్రామాల్లో కిరాణంతో పాటు శీతల పానీయాల దుకాణాల్లోనే ఎక్కువగా మద్యం అమ్ముతున్నారు. దుకాణాల్లో నిత్యావసర సరకులతో సమానంగా మద్యం అందుబాటులో ఉంటుంది. పలు గ్రామాల్లో దుకాణాల వద్ద కూర్చుని మద్యం  తాగడానికి అనుకూలంగా వసతులు కూడా కల్పిస్తున్నారు. శీతలపానియాల దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ నిర్వాహకులు బార్‌లను తలపించే విధంగా మద్యపానానికి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
పల్లెల్లో మద్యం దొరుకుతుండటంతో మద్యపానం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఎక్కువ మద్యం విక్రయించాలన్న లక్ష్యంతో ఆబ్కారీ శాఖ గొలుసు దుకాణాలను ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలున్నాయి. స్థానికంగా మద్యం  దొరుకుతుండటంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించేవారు, కూలీలు మద్యానికి బానిసలుగా మారుతున్నారు. జిల్లాలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతం కావడంతో గొలుసు దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి. మద్యం గొలుసు విక్రయాలతో గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. అయినా వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడం లేదు.
మద్యం గొలుసు దుకాణాలపై పోలీసుతో పాటు ఆబ్కారీ శాఖ దృష్టి సారించాలి. ఇటీవల రామగుండం పోలీసు కమిషనర్‌ ఆదేశాల మేరకు రెండు రోజులు తనిఖీలు చేయడంతో గొలుసు దుకాణాలపై దాడులు చేసి 87 కేసులు నమోదు  చేశారు. రూ.3.54 లక్షల మద్యం పట్టుకుని 99 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు. 2017లో పోలీసులు 190 కేసులు నమోదు చేసి 232 మందిని అరెస్టు చేశారు. విచ్చలవిడిగా సాగుతున్న గొలుసు దుకాణాలపై ఇటు ఆబ్కారీ, పోలీసు శాఖలు దృష్టి సారిస్తే పూర్తి స్థాయిలో నివారించేందుకు అవకాశం ఉంటుంది.

Related Posts