బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ పార్టీల నాయకులు ఇప్పటి నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. టిడిపి నాయకులు గ్రామదర్శిని, యువగర్జన, గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల పేరుతో తిరుగుతున్నారు. వైసిపి నాయకులు 'రావాలి జగన్... కావాలి జగన్' పేరుతో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితులను బట్టి కాంగ్రెస్, జనసేన, బిఎస్‌పిల నుంచి కూడా అభ్యర్థులు పోటీ చేస్తారనే ప్రచారం సాగినా టిడిపి, వైసిపి మధ్య బలమైన పోటీ ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వైసిపి అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాల గురించి వివరిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే బిసి.జనార్ధన్‌రెడ్డి నియోజకవర్గంలో రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని, అభివృద్ధి చేసే వారికి ప్రజలు పట్టం కట్టాలని, గ్రామదర్శిని పేరుతో తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారికి దగ్గరయ్యేందుకు కృషి చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రావాలి జగన్... కావాలి జగన్... కార్యక్రమం పేరుతో గ్రామాలు తిరిగి ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే నవరత్నాలు అమలు చేస్తామని, టిడిపి అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇప్పటి నుంచే కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో నీరు - చెట్టు కార్యక్రమం, సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదని, జన్మభూమి కమిటీల పేరుతో టిడిపి నాయకులు, కార్యకర్తలే సంక్షేమ పథకాలను తీసుకుంటున్నారని ప్రజలకు వివరిస్తున్నారు.నియోజకవర్గంలో బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, సంజామల మండలాలు ఉన్నాయి. ముఖ్యంగా నాయకుల గెలుపోటములను నిర్ణయించేది బనగానపల్లె మండలమే. ఇక్కడ సుమారు 70 వేల ఓట్లు ఉన్నాయి. బనగానపల్లె పట్టణంలో ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తే వారు గెలిచే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే బిసి.జనార్ధన్‌రెడ్డి గెలుపునకు ముఖ్య భూమిక బనగానపల్లె మండలమే. 2009 ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడానికి బనగానపల్లె మండలమే కీలకంగా మారింది. అవుకు మండలంలో నాలుగు గ్రూపులు ఉన్నాయి. కాటసానికి, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డికి, మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధిరెడ్డికి, టిడిపి నాయకులు ఐవి.పక్కీరారెడ్డికి వేర్వేరుగా గ్రూపులున్నాయి.
ఈ మండలంలో చల్లా గ్రూపు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీకి మెజార్టీ వస్తుంది. ప్రస్తుతం చల్లా రామకృష్ణారెడ్డి రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కొలిమిగుండ్ల మండలంలో ఎర్రబోతుల వెంకటరెడ్డికి పట్టు ఉంది. ఎర్రబోతుల వైసిపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సంజామల మండలంలో పెండేకంటి కుటుంబానికి మంచి పట్టు ఉంది. కోవెలకుంట్ల మార్కెట్‌యార్డు ఛైర్మన్‌గా పెండేకంటి కుటుంబానికి చెందిన పెండేకంటి కిరణ్‌కుమార్ టిడిపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వైసిపికి మండలంలో మంచి పట్టు ఉంది. కడప జిల్లాకు సరిహద్దుల్లో ఉండడంతో ఈ పార్టీకి ప్రజల్లో, మండలంలో వైసిపి బలంగా ఉంది. కోవెలకుంట్ల మండలంలో మండలస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసే నాయకులు లేకపోయినా గ్రామాల్లో టిడిపి, వైసిపికి బలమైన క్యాడర్ ఉంది. డాక్టర్ రామిరెడ్డి టిడిపి నుంచి జగన్ పాదయాత్ర సందర్భంగా వైసిపిలో చేరడం కొంత టిడిపిని బలహీన పరిచేలా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోవెలకుంట్ల ఉప సర్పంచి వాసగిరి కృష్ణమూర్తి (లాయర్‌బాబు) టిడిపికి అనుకూలంగా పని చేస్తుండడంతో డాక్టర్ రామిరెడ్డిలేని లోటు లాయర్ బాబు తీరుస్తారని టిడిపి నాయకులు ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో టిడిపి, వైసిపి రెండూ బలంగా ఉన్నాయి. రెండు పార్టీల నాయకులు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రచారాలు చేస్తున్నారు. కాటసాని కుటుంబానికి చెందిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం కొంతవరకు వైసిపికి నష్టమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని, నంద్యాల పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తానని తెలుపుతుండడంతో కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినా తమకు ఎలాంటి నష్టం లేదని వైసిపి నాయకులు చెబుతున్నారు. జనసేనకు అభిమానులు ఉన్నా ఇంతవరకు నాయకులు లేరు. జనసేన తరుపున ఎవరు పోటీ చేస్తారనే దానిని బట్టి బలం తేలనుంది. నియోజకవర్గంలో సిపిఎం, సిపిఐలకు కార్మిక వర్గం బలమైన శక్తిగా ఉంది. రానున్న ఎన్నికల్లో జనసేనతో అవగాహన కుదిరి బలమైన అభ్యర్థి ఖరాయితే గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. బిఎస్‌పి తరుపున కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.