కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై నిర్మితమయిన టిడిపి అనివార్య స్థితిలో తెలంగాణాలో తమ బద్ద శత్రువుతో దోస్తీ కట్టింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ మిత్రులు కానీ వుండరనడానికి సైకిల్, హస్తం అనుబంధం తాజా రాజకీయాల్లో మచ్చు తునక అనే చెప్పాలి. తెలంగాణాలో మహాకూటమి ఏర్పాటు తరువాత టిడిపికి డిమాండ్ పెరిగింది. అసలు జీరో స్థాయికి చేరిన టిటిడిపి కి ఆక్సిజన్ అందించింది హస్తం. దాంతో ఏ పార్టీలో టికెట్ దొరకని వారు సైతం టిడిపిలో చేరుతూ పొత్తు కోటా పెంచేస్తున్నారు. దాంతో సైకిల్ రేసులోకి వచ్చేసింది. కాకపోతే అధిక టికెట్లు ఇచ్చే స్థితిలో కాంగ్రెస్ లేదు. ఈ విషయం తెలిసినా టి టిడిపి ఎక్కువ టికెట్లకోసం ఎదురు చూస్తుండటంతో పసుపుదళపతికి తలపోట్లు మొదలయ్యాయి.ఫైనల్ గా టికెట్ల ఖరారు అన్నది చంద్రబాబు చేతిలోనే టిటిడిపి ఉంచింది. పేరుకు తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చనట్లు బాబు వ్యవహారం నడుపుతున్నా కీలక నిర్ణయాలన్నీ ఎపి చంద్రుడే తీసుకుంటారన్నది బహిరంగ రహస్యమే. తెలంగాణాలో పొత్తుల ఖరారు అంశం ఇంకా తేలకుండానే టికెట్లు ఆశించే వారు టిటిడిపి లో పెరగడంతో నేరుగా అధినేత సీన్ లోకి దిగిపోయారు. ఎక్కువ టికెట్లు అడగొద్దు ఇచ్చిన వాటితో సర్దుకు పోవాలి. కూటమి అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు తెచ్చుకుందామని తమ్ముళ్ళ జోరుపై నీళ్లు చల్లేశారు చంద్రబాబు.బలం లేని తెలంగాణాలో ఇచ్చిన వాటిని మహాభాగ్యం అని పుచ్చుకోవాలి. అదే రీతిలో ఏపీలో రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ టిడిపి ఇచ్చినవి స్వీకరించాలి. ఇది లోపాయికారీగా ఇరు పార్టీల అగ్ర నేతల నడుమ కుదిరిన ఒప్పందమని టిడిపి లో టాక్ వినవస్తుంది. అందుకే బాబు టి తమ్ముళ్ళు హుషారు అవ్వొద్దని ముందే చెప్పేశారు. కెసిఆర్ ను పదవీచ్యుతుడ్ని చేయడమే లక్ష్యంగా పని చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇచ్చిందో అన్నే ఆ పార్టీకి ఏపిలో టిడిపి కేటాయిస్తుందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు.