వైసీపీ అధినేత జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు నియోజకవర్గాల వారీగా సమీక్షలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సర్వేల నివేదికల ఆధారంగా వీక్ గా ఉన్న నియోజకవర్గ బాధ్యులను తనవద్దకు జగన్ రప్పించుకుంటున్నారు. వారు చేసే కార్యక్రమాల్లో లోపాలేమిటో? పార్టీ బలోపేతానికి ఇంకా ఏమి చేయాలన్న దానిపై నియోజకవర్గ ఇన్ ఛార్జులకు వివరిస్తున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభం కావడానికి ముందు, పాదయాత్ర పూర్తయిన తర్వాత తాను ఉండే శిబిరంలోనే ఈ సమీక్షలను నిర్వహిస్తున్నారు. రోజుకు నాలుగైదు నియోజకవర్గాల నేతలతో సమీక్ష జరుపుతున్నారు.జగన్ పాదయాత్రలో ఉండటంతో కొందరు ఇన్ ఛార్జులు సక్రమంగా పనిచేయడం లేదన్న రిపోర్టులు అందడంతో జగన్ అప్రమత్తమయ్యారు. పార్టీకోసం కష్టపడే వారికి ఖచ్చితంగా అవకాశముంటుందని ఈ సందర్భంగా జగన్ కొందరు నేతలకు హామీ ఇస్తున్నారు. నేరుగా టిక్కెట్ అన్న హామీ ఇవ్వకపోయినా జాగ్రత్తగా పనిచేసుకోవాలని సంకేతాలు ఇస్తుండటంతో టిక్కెట్ తమకేనన్న ధీమాతో కొందరు నేతలు ఉత్సాహంగా నియోజకవర్గాల వైపునకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఆరేడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో జగన్ అన్ని రకాలుగా నేతలను అప్రమత్తం చేస్తున్నారు. వారితో నేరుగా తానే వన్ టు వన్ మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. మధ్యలో కొందరు నేతల జోక్యంతో అనవసరంగా నేతలకు, తనకు మధ్య గ్యాప్ పెరుగుతుందని భావించిన జగన్ తానే వారితో మాట్లాడుతుండటం మంచి పరిణామమంటున్నారు వైసీపీ నేతలు. కొందరికి నేరుగా టిక్కెట్ ఇవ్వనని చెప్పకుండా అధికారంలోకి వస్తే మరో అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెబుతుండటం గమనార్హం.కొందరు నేతల పట్ల ప్రజల్లో మంచి సానుకూలత ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న రిపోర్టులు అందాయి. అంది వచ్చే అవకాశాన్ని చేజార్చుకోవద్దంటూ తన వద్ద ఉన్న సర్వే రిపోర్టులను వారికే చూపిస్తుండటం విశేషం. ఇలా ప్రకాశం, నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఇన్ ఛార్జులకు ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఇప్పటి వరకూ జిల్లాల వారీగా సమీక్షలు చేసిన జగన్ రెండు, మూడు రోజుల నుంచి నియోజకవర్గాల వారీగా రివ్యూలు జరుపుతున్నారు. కేవలం పార్టీ, వ్యక్తిగత ఇమేజ్ మీదమాత్రమే ఆధారపడకుండా నియోజకవర్గంలో బలంగా ఉన్న సామాజిక వర్గం, మహిళలు, యువ ఓటర్లపై దృష్టి పెట్టాలని వారికి జగన్ గట్టిగా క్లాస్ పీకుతున్నారు. అలాగే పార్టీలో ఉన్నఅంతర్గత విభేదాలను పరిష్కరించుకోవాలని, లేకుంటే తన దృష్టికి తేవాలని జగన్ సూచిస్తున్నారు. మొత్తం మీద జగన్ పాదయాత్రలో ఉన్నా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పార్టీ వీక్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.