ఏపీలో వచ్చే ఎన్నికల్లో తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్న జనసేన ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే రాజకీయాల గురించి కనీస పరిజ్ఞానం ఉన్న ప్రతీ ఒక్కరి నోట ముందుగా వినిపించే పేరు తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అండర్ కరెంట్‌గా విస్తరిస్తూ వస్తోంది. ఇక్కడ ఆ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో చూపిస్తున్న దూకుడుకు అధికార టీడీపీతో పాటు విపక్ష వైసీపీ నాయకుల్లో సైతం టెన్షన్ మొదలైంది. జనసేన బలంగా ఉంటుందనుకుటున్న చోట్ల ఆ పార్టీ నుంచి సరైన అభ్యర్థులు రంగంలో ఉంటే ప్రధాన పార్టీలకు షాక్ తప్పదని ఇప్పటికే పలు రాజకీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కనీసం ఐదారు నియోజకవర్గాల్లో జనసేన గెలవడం లేదా ? ప్రధాన పార్టీల గెలుపు, ఓటమిలను ప్రభావితం చేసే స్థాయిలో ఉంది.జనసేననే అక్కడ ఎలాంటి అభ్యర్థులను రంగంలోకి దించుతారో ఒక్కటే చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా తర్వాత జనసేన ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువు అయిన విశాఖపట్నం జిల్లాలో కూడా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు సైతం ఇప్పుడు ఆ పార్టీలోకి జంప్ చేసేస్తున్నారు. వాస్తవంగా చూస్తే తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోనే 2009లో ప్రజారాజ్యం సైతం బలమైన ప్రభావం చూపింది. ఈ రెండు జిల్లాల్లోనే ప్రజారాజ్యనికి ఏకంగా 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. కాకినాడ, విశాఖపట్నం ఎంపీ సీట్లలో ప్రజారాజ్యం ఎంపీ అభ్యర్థులు రెండో ప్లేస్లో నిలిచి… కాంగ్రెస్ అభ్యర్థులకు బలమైన పోటీ ఇచ్చారు. తాజాగా తూర్పుగోదావరిలో ఇతర పార్టీల నుంచి జనసేనలోకి చేరికలు ముమ్మరంకాగా ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలోనూ అదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. టీడీపీ ఇన్‌చార్జులుగా పనిచేసిన వాళ్లు, ఆ పార్టీలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు రావని డిసైడ్ అయిన వాళ్లు జనసేన కండువాలు కప్పుకుంటున్నారు. యలమంచలి నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుందరపు విజయ్‌కుమార్ తాజాగా జనసేన కండువా కప్పుకున్నారు. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జుగా పని చేసిన ఆయన్ను ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకల్ల రమేష్‌బాబు కోసం పక్కన పెట్టారు. అప్పటి నుంచి టీడీపీలో ప్రయార్టీ లేకపోవడంతో ఆయన జనసేన గూటికి చేరిపోయారు. అలాగే వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి ఉషా కిరణ్ సైతం జనసేనలో చేరారు. వీరితో పాటు స్థానిక సంస్థలకు చెందిన పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు సైతం జనసేనలోకి జంప్ చేసేస్తున్నారు. టీడీపీ, వైసీపీలోని బలమైన ద్వితీయ శ్రేణి కేడర్ సైతం జనసేన వైపే చూస్తోంది.ఇక మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ లాంటి వారి చూపులు సైతం జనసేన వైపు ఉండొచ్చని చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైన తూర్పుగోదావరి జిల్లా తర్వాత విశాఖపట్నం జిల్లాలోనే ఇతర పార్టీల నుంచి జనసేనలోకి జంపింగులు జోరందుకోనున్నాయి. ఎన్నికల టైమ్‌కు ఈ చేరికలు మరింత ఉధృతం కానున్నాయి.