రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోదీని, బీజేపీని గద్దె దించాలని ప్రతిపక్షాలు భావిస్తోన్న సంగతి తెలిసిందే. అందుకోసమే బీజీపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై మహాకూటమిగా ఏర్పడేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ ఏర్పాటు చేసి …మోదీని ఢీకొనేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. అయితే, మోడీకి దీటుగా ప్రధాని అభ్యర్థి బరిలో దిగే అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వంటి నేత అవసరం యూపీఏకు ఎంతైన ఉందని జాతీయ స్థాయి నేతలు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రాముఖ్యతను మమతా బెనర్జీ గుర్తించి ఆయనను తన ర్యాలీకి ఆహ్వానించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సమకాలీన రాజకీయాల్లో మోదీకి దీటుగా జవాబివ్వగలిగిన సీఎంలలో చంద్రబాబు ఒకరు. అదీగాక, జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతో సంబంధాలు కలిగి ఉన్న ఒకే ఒక లీడర్ చంద్రబాబు. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో చంద్రబాబు ఒక కీలక లీడర్ గా మారారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే, చంద్రబాబును జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందేనని పలువురు నేతలు పట్టుబడుతున్నారట. చంద్రబాబు కోరిన పదవి ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదట. అయితే, రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేదని సోమవారం నాడు చిదంబరం ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు జాతీయ అరంగేట్రం ఊహాగానాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అవసరమైతే చంద్రబాబును ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు కూడా కొందరు జాతీయ స్థాయి నేతలు సుముఖంగా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. మరి, ఆ ఆహ్వానాలపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో అన్నది ఆసక్తిగా మారింది.