YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న..'సెల్ఫ్‌ 4 సొసైటీ' యాప్

 ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న..'సెల్ఫ్‌ 4 సొసైటీ' యాప్
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దలు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కంటే మంచి పని మరొకటి లేదు. దేశవ్యాప్తంగా ఇలా ఎన్నో కార్పొరేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఆ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఖాళీ సమయంలో వాలంటీర్స్‌గా మారిపోతున్నారు. తమకు తోచిన విధంగా సమాజానికి సాయం చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇలా సేవా కార్యక్రమాలతో సమాజానికి మంచి చేస్తున్నసంస్థలు, వాలంటీర్లకు అండగా నిలుస్తోంది కేంద్రం. వీరందరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. 
సమాజ సేవ చేస్తున్న వాలంటీర్స్, ప్రొఫెషనల్స్‌ కోసం కేంద్రం ప్రత్యేకంగా 'సెల్ఫ్ 4 (ఫర్) సొసైటీ' పేరుతో ఓ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని టౌన్ హాల్‌లో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో 2వేలమంది ఐటీ ప్రొఫెషనల్స్‌తో పాటూ.. దేశవ్యాప్తంగా 100 వేదికల నుంచి ఎంతోమంది వీడియో కాల్ ద్వారా భాగస్వామ్యంకానున్నారు. ఈ యాప్ ప్రధాని మోదీ.. సేవా కార్యక్రమాలు చేస్తామని ముందుకొచ్చిన పలువురు కార్పొరేట్ దిగ్గజాలు, ఐటీ కంపెనీల మధ్య వారధిలా పనిచేయనుంది. ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి.. ప్రధాని ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేయనున్నారు. 
దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఈ 'సెల్ఫ్ 4 (ఫర్) సొసైటీ' యాప్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. అలాగే కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగుల్లో సేవా దృక్పథం పెంపొందింపచేసి.. ఈ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం పెంచేందుకు సాయపడుతుందంటోంది. ఈ యాప్ ద్వారా కేంద్రం చేపట్టే స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాల్లో కూడా ఎక్కువమందిని భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారు. 

Related Posts