అమెరికా హెచ్–1బీ వీసాలకు సంబంధించి ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ పొందిన టాప్ 10 కంపెనీల్లో దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ చోటు దక్కించుకుంది. సెప్టెంబర్ 30తో ముగిసిన 2018 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ మొత్తం 20,755 హెచ్–1బీ లేబర్ సర్టిఫికేషన్స్ పొంది 8వ స్థానంలో నిలిచింది. టాప్ 10లో చోటు దక్కించుకున్న సంస్థల్లో ఇండియా నుంచి టీసీఎస్ ఒక్కటే ఉండటం విశేషం. మొత్తం 1,51,164 సర్టిఫికేషన్స్‌తో లండన్‌కు చెందిన ప్రొఫెషనల్ సర్వీసెస్ దిగ్గజం ఎర్నెస్ట్ & యంగ్ అగ్రస్థానంలో ఉన్నట్లు అమెరికా కార్మిక శాఖ ఒక నివేదికలో తెలియజేసింది. ఈ జాబితాలో ఎర్నెస్ట్ & యంగ్ తర్వాత డెలాయిట్ (69,869), ఎంఫసిస్ (66,671) సంస్థలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
భారత్- అమెరికా సంస్థ కాగ్నిజెంట్ కార్పొరేషన్ (47,732) నాలుగో స్థానంలో నిలిచింది. హెచ్‌సీఎల్ అమెరికా (42,820), కేపోర్స్ ఇంక్ (32,996), యాపిల్ (26,833) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టీఎస్ (8వ స్థానం) తర్వాత క్వాల్‌కమ్ టెక్నాలజీస్ (20,723), క్యాప్ జెమిని (13,517) సంస్థలు టాప్-10లో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.
భారత ఐటీ వృత్తి నిపుణుల నుంచి హెచ్-1బీ వీసాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, ఔషధ, విద్య, బయోటెక్నాలజీ, ప్రత్యేక వ్యాపార రంగాల్లో నిపుణులకు హెచ్1బీ వీసాలు జారీ చేస్తారు. ఏడాదికి 65,000 హెచ్1బీ వీసాలతో పాటు, అమెరికాలో ఎంఎస్ వంటి ఉన్నత విద్య అభ్యసించిన వారికి మరో 20,000 వీసాలు జారీ చేస్తారు. హెచ్1బీకి దరఖాస్తు చేసే ముందు నియామక సంస్థ, ఉద్యోగ స్థితి దరఖాస్తును అమెరికా కార్మిక శాఖకు పంపుతుంది. దానిని పరిశీలించి, కార్మికశాఖ ఆమోదముద్ర వేశాకే, కంపెనీలు హెచ్1బీ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
విదేశీ నిపుణులు తమ దేశంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు అమెరికా హెచ్–1బీ వీసా జారీ చేస్తుంది. అక్టోబరు 5 నాటికి అమెరికాలో 4,19,637 మంది విదేశీ నిపుణులు హెచ్1బీ వీసాలపై పనిచేస్తుండగా.. వారిలో 3,09,986 మంది భారతీయులే ఉండటం విశేషం. సాప్ట్‌వేర్ డెవలపర్స్ నియామకాల కోసం అత్యధికంగా 2,85,963 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో నాలుగో వంతు వీటిదే కావడం గమనార్హం. కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్ (1,76,025), కంప్యూటర్ వృత్తినిపుణులు (1,20,736), సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ (67,262), అకౌంటెంట్లు-ఆడిటర్లు (54,241), కంప్యూటర్ ప్రోగ్రామర్లు (53,727) తర్వాతి స్థానాల్లో నిలిచారు.