మాఘబహుళ దశమి రోజు స్వామి దయనంద సరస్వతీ జయంతి 1824 లో, గుజరాత్ రాష్ట్రంలోని టంకర అనే గ్రామంలో జన్మించారు స్వామి దయనంద సరస్వతీ. వీరి పూర్వాశ్రమ నామం మూలశంకర. చిన్నవయసులోనే సత్యాన్వేషణతో ఇల్లు వదిలిన మూలశంకరుడు, అనేక ప్రాంతాలను తిరిగి ఆఖరికి మథురలో స్వామి విరాజానంద అనే సన్యాసి వద్ద శిష్యరికం చేశారు. విరజానందుడు అంధుడే అయినా, జ్ఞాన దృష్టి కలవాడు. ధర్మాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, ఆ పనిని దయానందునికి అప్పగించారు విరజానందుడు.అప్పటి నుంచి దయానందుడు భారతదేశ నిర్మాణానికి, సనాతన ధర్మ పునరుద్ధరణకు ఎంతో కృషి చేశారు.
గోవధ మీద ఆంగ్లేయ ప్రభుత్వంతో మాట్లాడి, గోవధను నిషేదించాలని చెప్పిన వారిలో అగ్రగణ్యుడు దయానందుడు. అనేకమంది రాజులను కలిసి, వారిలో ధర్మానురక్తిని నింపారు. 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో కీలకపాత్ర పోషించడంతో పాటు, భారతదేశానికి సంపూర్ణం స్వరాజ్యం రావాలని ఎలుగెత్తి అరిచారు. భారతదేశ స్వరాజ్యం గురించి భారతీయుడు ఇచ్చిన తొలి పిలుపు అదే. ఆ తర్వాత దాన్నే లోకమాన్య బాలగంగాధర తిలక్ కొనసాగించారు. తాను బ్రతికింది 59 ఏళ్ళే అయినా, అందులో ఋగ్వేదానికి సంపూర్ణంగానూ, యజుర్వేదానికి సగం వరకు భాష్యం రాశారు. వారు రాసిన వేదభాష్యం అప్పటి వరకు వేదంపై ఉన్న అభిప్రయాలను మరింత పెంచింది.
సర్వమత సభను ఏర్పాటు చేసి, అన్ని మతాల పెద్దలను దానికి పిలిచి, ఈ లోకానికి వేదమే ప్రమాణమని, అందరూ వేదాన్నే అనుసరించాలని, Back to Vedas అని పిలుపిచ్చారు. వారు ఎవరూ ఒప్పుకోకపోవడంతో తన ఆశయసాధనకు ఆర్యసమాజ్ అనే సంస్థను స్థాపించారు.
మేడం కామ, పండిత లేఖా రాం, స్వామి శ్రద్ధానంద, సావర్కర్, రాం ప్రసాద్ బిస్మల్, లాలా లజపతి రాయ్ మొదలైన వారిపై వీరి ప్రభావం తీవ్రంగా ఉంది.