YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సీబీఐ ప్రతిష్ట కాపాడేందుకు ప్రయత్నం

సీబీఐ ప్రతిష్ట కాపాడేందుకు ప్రయత్నం
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రతిష్ఠకు ఎలాంటి భంగం కలగకుండా చూసేందుకే ఆ సంస్థ ఉన్నతాధికారులను సెలవుపై పంపించామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీబీఐ వివాదంపై జైట్లీ స్పందించారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల వారిని సెలవుపై మాత్రమే పంపామని స్పష్టం చేశారు. ఇదొక దురదృష్టకర పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. వీరిపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటుచేశామన్నారు. ‘ఈ కేసు విచారణ పారదర్శకంగా జరుగుతోంది. కేసును విచారించేందుకు సరికొత్త బృందాన్ని నియమించాం. ప్రస్తుతం సీబీఐలో అసాధారణ పరిస్థితి నెలకొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని వాళ్లపై వాళ్లే విచారణ చేసుకునేలా అనుమతించడం వీలుకాదు. అందుకే వాళ్లను సెలవుపై పంపించాం. సీబీఐ ప్రత్యేక అధికారి రాకేశ్‌ ఆస్థానాపై నమోదైన కేసు విచారించేందుకు సీబీఐ డీఐజీ తరుణ్‌ గోబా, ఎస్పీ సతీశ్‌ దాగర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ వి.మురుగేశంను నియమించాం’ అని జైట్లీ వివరించారు. సీవీసీ ప్రతిపాదన మేరకే ప్రభుత్వం సీబీఐ అధికారులపై చర్యలు తీసుకుందని జైట్లీ స్పష్టం చేశారు. కాగా, అలోక్ వర్మను సెలవుపై పంపించడం పట్ల కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను జైట్లీ కొట్టిపారేశారు. రాఫెల్ డీల్‌లో అవకతవకలను బయటపెట్టేందుకు అలోక్ వర్మ ప్రయత్నిస్తున్నారని, అందుకే సీబీఐ డైరెక్టర్ స్థానం నుంచి ఆయన్ని కేంద్ర ప్రభుత్వం తప్పించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల్లో నిజం లేదని జైట్లీ తేల్చి చెప్పారు. మరోవైపు, తనను సెలవుపై పంపించడంపై అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన పదవీకాలం ఇంకా ముగియకుండానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన కోర్టుకెక్కారు.

Related Posts