- నేడు నాటకోత్సవాల్లో
- నంది నాటకోత్సవం శోభ ఇనుమడించింది
తెలుగు పద్య సోయగం కాంతులీనింది. నంది నాటకోత్సవం శోభ ఇనుమడించింది. నిన్నటి వరకు బాలల నాటికలో సందడి చేసిన తెనాలి రామకృష్ణ కవి కళా క్షేత్రం శుక్రవారం పద్య నాటకంతో పదనిసలు పలికింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర చలన చిత్ర, టి.వి., నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవం-2017లో 20 రోజుల పాటు పద్య, పౌరాణిక నాటక పోటీలు ప్రేక్షకులకు విందు పంచనున్నాయి. తొలిరోజు ఉదయం 10.30 గంటలకు నందిగామ వేళాంగిణి మాత నాట్యమండలి వారు ప్రదర్శించిన ‘దావీదు విజయం’ నాటకంలో దైవభక్తికి, అహంకారానికి మధ్య జరిగే యుద్ధాన్ని చూపించారు. నేతల ప్రేమచంద్రుడు రచనకు అంబటి శామ్యేలు దర్శకత్వం వహించారు. రెండో నాటకంగా ఖమ్మం కల్చరల్ అసోసయేషన్ వారు ప్రదర్శించిన ‘విశ్వామిత్ర విజయం’ ద్వారా పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే నానుడిని నిజం చేసి చూపించారు. విశ్వామిత్రుని తపసును భంగం చేయాలని వశిష్టుడు, పరమ శివుడు రెండు సార్లు ప్రయత్నించి విజయం సాధించినా పట్టవదలక మూడోసారి తపస్సు చేసి వశిష్టుని చేతనే బ్రహ్మర్షి అనిపించుకుంటాడు. ఇదే ఈకథలోని సారాంశం. కథకు అనుగుణంగా చేసిన అలంకరణలు, సెట్టింగులు విశ్వామిత్రుని హావభావాలకు దర్పణంగా నిలిచాయి. టి.నరసింహారావు దర్శకత్వంలో ప్రదర్శించిన ఈనాటకాన్ని హెచ్.వి.ఎల్.ప్రసాద్ బాబు రచించారు. మూడో నాటకంగా మిర్యాల గూడ సాంస్కృతిక కేంద్రం వారు ‘కల్యాణ మండోదరి’ నాటకాన్ని రమణీయంగా ప్రదర్శించారు. తడికమళ్ల రామచంద్రరావు రచన, దర్శకత్వం చేశారు. రావణుడు మండోదరిని చూసి ఆకర్షితుడై ఉండగా, నారదుడు తన తెలివితేటలతో వారిద్దరికి కల్యాణం చేయడాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈనాటకం కథను నడిపించారు. సకల లోకాలను వేధిస్తున్న రావణుడికి ముక్కుతాడు వేసేందుకు అతనిని ఒకింటి వాడిని చేయాలని తలచి లోక కల్యాణం కోసం మండోదరితో కల్యాణం చేయించాడు నారదుడు.
కళాకారులకు సత్కారం
ప్రముఖ పౌరాణిక, పద్య నాటక కళాకారులను శుక్రవారం సాయంత్రం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఎఫ్.డి.సి వారు సత్కరించారు. అంతర్జాతీయ పద్య నాటక కళాకారులు ఆరాధ్యుల వెంకటేశ్వరరావు, పౌరాణిక నటులు రైల్వే జానీ, మరో రంగస్థల నటులు కొణతాల సోములును సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. బొబ్బిళ్లపాటి సాయి, జానీబాషా, సత్యనారాయణ శెట్టి, పద్మజా ప్రభాకర్, కౌన్సిలర్ గౌసియా బేగం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటకాలు ప్రదర్శించిన కళాకారులకు చెక్కులు, ప్రశంసాపత్రాలు ఇచ్చారు.
నాటకోత్సవాల్లో నేడు
ఉదయం 10.30 గంటలకు ఖమ్మం వనంకృష్ణ రాయల పరిషత్ వారి‘ భక్త సిరియాళ’ పద్య నాటకం, మధ్యాహ్నం 2గంటలకు మధిర సుమిత్ర యూత్ అసోసియేషన్ వారి ‘యయాతి’, సాయంత్రం 6 గంటలకు ఖమ్మం శ్రీభక్తరామదాసు కళామండలి వారి ‘శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహాత్య్సం’ నాటకం ప్రదర్శనలు ఉన్నాయని ఎఫ్.డి.సి అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస నాయక్ తెలిపారు.