కొండల్లో ఉన్న తమ గ్రామాలకు ఏ ఒక్క అధికారీ పట్టించుకోవడం లేదని, పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పెంటిభద్ర గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిత్లీ తుపాను తీరాం దాటి 10 రోజులు కావస్తున్న తమ గ్రామంలో ఏ అధికారీ అడుగు పెట్టలేదని గ్రామానికి చెందిన వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో 130 ఇళ్లు, 500 జనాభాగల గ్రామంలో తుపాను ప్రభావంతో 28 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని, సుమారు పది ఇళ్లు పాకిక్షంగా దెబ్బతిన్నాయని, రెండు షాపులు ధ్వంసంకాగా, ఒక ఆవు, ఒక మేక మృతిచెందాయని, గిరిజనులకు రేకులు తగిలి గాయపడ్డారని వాపోయారు. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క బోరు వద్ద వస్తున్న నీరు బురదగా వస్తోందని, తాగేందుకు ఉపయోగపడం లేదని ఆవేదన చెందుతున్నారు. ట్యాంకర్లతో మంచినీరు అందించాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్నామన్న ఆనందం తప్ప, తాము ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తుపాను ప్రభావంతో ఈదురుగాలులకు వరి పంటలతో పాటు, జీడి, కొబ్బరి తోటలు నాశనమయ్యాయన్నారు. గాయాలైన వారికి వైద్యసేవలు అందించిన దాఖలాల్లేవని అన్నారు. పశువైద్యసేవలు అందించాలని కోరారు. గ్రామంలో ఏం జరిగిందో అధికారులు, పాలకులు సందర్శించకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలు తమకు అందించాలని కోరుతున్నారు.