సర్గ-66
రామ లక్ష్మణులకు శివుడి విల్లు చూపమని
జనకుడికి చెప్పిన విశ్వామిత్రుడు
మర్నాడు ఉదయం జనకమహారాజు, ప్రాతః కాలకృత్యాలను తీర్చుకొని, శ్రీరామచంద్రమూర్తిని తీసుకొని రమ్మని విశ్వామిత్రుడికి కబురుపంపాడు. వారు రాగానే, వారి కోరికేంటో తెలియచేయమని అడిగాడు విశ్వామిత్రుడిని. "జనక మహారాజా, వీరు దశరథ మహారాజు కొడుకులు. సూర్యవంశాలంకారాలు. మహా వీరులు. ప్రపంచంలోనే ప్రసిద్ధికెక్కిన వారు.వీరికి నీదగ్గరున్న ధనుస్సును చూపిస్తే, వారి కోరిక ప్రకారం, అది చూసిన తర్వాత, వారిష్టప్రకారం వెళ్లిపోతారు" అని రామ లక్ష్మణులను చూపిస్తూ చెప్పాడు జనకుడితో విశ్వామిత్రుడు.
సమాధానంగా జనకుడు, " మునీంద్రా, ఈ ధనుస్సు నాదగ్గర వున్న కారణం చెప్తాను. నిమికి ఆరవ వాడైన దివ్య మహిమగల-నిర్మల మనస్సుగల, దేవరాతుడనే రాజు దగ్గర దేవతలు ఈ వింటిని ఇల్లడగా వుంచి స్వర్గానికి పోయారు. దేవతలకు ఈ విల్లు దొరకడానికీ కారణముంది. దక్షుడు చేస్తున్న యజ్ఞాన్ని ధ్వంసం చేద్దామనుకున్న రుద్రుడు, యజ్ఞంలో భాగమైన దేవతలపై కూడా ఆగ్రహించాడు. యజ్ఞంలో దేవతలందరు వారి భాగం పంచుకొని తనకెందుకు లేకుండా చేసారని, తన భాగం ఇవ్వకపోతే వారందరి తలలు తనదగ్గరున్న వింటితో నరికి వేస్తానని భయపెట్టాడు. తెల్లబోయిన దేవతలందరు, రుద్రుడిని ప్రార్తించడంతో, సర్ప భూషణుడు వారిని క్షమించి ఆయన దగ్గరున్న ధనుస్సును వారికిచ్చాడు. దానిని దేవతలు తెచ్చి నా పూర్వీకుడికిచ్చారు. అప్పటినుంచి ప్రతిదినం పూజలందుకుంటూ నా ఇంట్లో వుందా ధనుస్సు. ఒకసారి యజ్ఞం చేద్దామన్న అభిప్రాయంతో, నాలుగు ఎద్దులతో కొంత భూమిని దున్నించాను. అప్పుడు నాగేటిచాలులో ఒక పసిపాప దొరికింది. నాగటిచాలంటే సీత అని, నాగటిచాలులో దొరికింది కనుక సౌందర్యవతైన ఆ పసి దానికి సీత అని పేరు పెట్టాను. సీత పవిత్రంగా జన్మించినదే అయినా, లోకంలో అందరిలాగా పుట్టింది కాదు. నేనామెను నా స్వంత కూతురులాగానే సాకాను. సీత వీర్యశుల్కని భావించి, ఎవరికిచ్చి పెళ్లిచేయకుండా వూరుకున్నాను. అయితే లోకంలోని రాజకుమాలెందరో వచ్చి, సీతను తమకిమ్మని కోరారు".
"అలా అడగడానికి వచ్చిన రాజకుమారులతో, సీత వీర్యశుల్కనీ, శక్తి ప్రదర్శన చేయడమే అమెకివ్వదగిన శుల్కమనీ, ఎటువంటి వస్త్రవాహనాది అలంకారాలు ఇవ్వాల్సిన పనిలేదనీ, నా దగ్గరున్న ధనుస్సును ఎక్కుపెట్టగలవాడికే నా కూతురు సీతను ఇస్తానని చెప్పాను. వచ్చినవారిలో ఎవరుకూడా వింటిని ఎక్కుపెట్టడం మాట అటుంచి, అల్లెతాడును ఎక్కించడంగాని, కనీసం వింటిని ఎత్తడంగాని చేయలేకపోయారు. వచ్చిన వారందరూ బింకపు బిరుదులుగలవారే కాని, నిజమైన బలవంతులు కాదని-అల్ప పౌరుషులని తెలుసుకొని, వారెవరికీ కన్యనీయనన్నాను. వారంతా నామీద కోపంతో యుద్ధానికి సిద్ధమై నా నగరాన్ని ముట్టడించే ప్రయత్నం చేసారు. అయినా నేనెవర్నీ లక్ష్యపెట్టలేదు. వారందరు ఏకమై, వ్యూహాత్మకంగా ఒక సంవత్సర కాలం మిథిలా నగరాన్ని ముట్టడించారు. సాధనాలన్నీ క్షీణించాయి. అప్పుడు దేవతలను నా తపస్సుతో తృప్తి పరిచాను. సంతోషంతో వారు నాకు చతురంగబలాలనిచ్చారు. ఆ బలగంతో నా విరోధులందరినీ తరిమికొట్టాను. ఇది ఈ ధనుస్సు వృత్తాంతం. దానిని శ్రీరామ లక్ష్మణులకు చూపిస్తాను. శ్రీరామచంద్రమూర్తి విల్లెక్కుపెట్టగలిగితే నేను అదృష్టవంతుడిని. అయోనిజైన సీతను ఆయన కిస్తాను" అని అంటాడు.
రేపు తరువాయి భాగం..