ముందు కోహ్లీ మెరుపులు, ఆ తర్వాత హెట్ మెయిర్, షైహోప్ పోరాట ప్రతిమతో సాగర తీరంలో సగటు క్రికెట్ అభిమానికి సిసలైన క్రికెట్ మజా దొరికింది. ఉత్కంఠకు దారితీసిన విశాఖ వన్డే చివరికి టై అయింది. కోహ్లీసేన నిర్దేశించిన 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు విండీస్ ప్రాణం పెట్టి ఆడి దాదాపు భారత్‌ను ఓడించినంత పని చేసింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 321 పరుగుల స్కోరు చేసింది. నర్స్ (2/46), మెక్‌కోయ్ (2/71) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో విండీస్ కూడా 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 321 పరుగులే చేసింది. ఆఖరి ఓవర్లో 14 పరుగులు కావాల్సిన దశనుంచి ఐదు పరుగులు చేయాల్సిన స్థితిలో హోప్ బౌండరీనే కొట్టడంతో మ్యాచ్ టై అయింది. హెట్‌మయెర్ (64 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 94) సుడిగాలి ఇన్నింగ్స్‌కు షాయ్ హోప్ (134 బంతుల్లో 10 ఫోర్లు, 3 సికర్లతో 123 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌కు తోడు హేమ్‌రాజ్ (24 బంతుల్లో 6 ఫోర్లతో 32) సత్తాచాటడడంతో విండీస్ పోరాడగలిగింది. కుల్దీప్ (3/67) మూడు వికెట్లు తీశాడు. విరాట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్ శనివారం పుణెలో జరుగుతుంది.