ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే దృఢ సంకల్పంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో మరో మైలురాయి నమోదైంది. 294వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా.. ప్రస్తుతం విజయనగరంలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర సాలూరు మండలం, బాగువలస వద్ద 3,200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయికి గుర్తుగా బాగువలస వద్ద జననేత జగన్ కానుగు మొక్క నాటారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో తాము ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలను ప్రజలు జగన్ ద ష్టికి తీసుకువచ్చారు. ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు, సర్వశిక్షా అభియాన్, వైద్య, ఆరోగ్య శాఖ, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వినతి పత్రాలు సమర్పించారు. 2003 నుంచి పని చేస్తున్నా జీతాలు పెరగడం లేదని సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సరైన వేతనాలు అందించడం లేదంటూ ఆశా వర్కర్లు గోడు వెళ్లబోసుకున్నారు. టీడీపీ పాలనలో చదువుకున్న వాళ్లు కూడా ఇంట్లోనే కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడిందని యువత వాపోయారు.