శశికళ బంధువు, అన్నాడీఎంకే బహిష్కృత టీటీవీ దినకరన్ కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తమిళనాడులో అనర్హతను ఎదుర్కొంటున్న 18 మందిపై కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ఈ ఎమ్మెల్యేలు అనర్హులేనని తేల్చి చెప్పారు. అనర్హత వేటును సమర్థించిన న్యాయస్థానం, ఎమ్మెల్యేలంతా పదవీచ్యుతులేనని తెలిపింది. ఈ తీర్పు ముఖ్యమంత్రి పళనిస్వామికి పెద్ద ఊరటే. కాగా, అనర్హత చెల్లబోదని తీర్పు వస్తుందన్న ఉద్దేశంతో ఉన్న దినకరన్, తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించిన సంగతి తెలిసిందే.తాజా తీర్పుతో ఆయా స్థానలకు వచ్చే ఆరు నెలల్లో ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పుపై దినకరన్ మాట్లాడుతూ మాకిది ఎదురుదెబ్బ కాదని, దీన్నొక అనుభవంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. దీనిపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేయనున్నట్టు తెలిపారు. పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు పళని స్వామి కి మద్దతు ఉపసంహరించుకున్నారు. తరువాత దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం లో చేరారు. దాంతో స్పీకర్ ధనపాల్ వీరిని అనర్హులుగా ప్రకటించారు. ఈ తీర్పు ముఖ్యమంత్రి పళనిస్వామికి పెద్ద ఊరటేనని చెప్పవచ్చు. తమిళనాడు శాసనసభలో ఇరవై స్థానాలు ఖాళీ అయ్యాయి. ( తిరువారూరు నుంచి గెలిచిన కరణానిధి, తిరుప్పరన్కుండ్రం శాసనసభ్యుడు ఏకే బోసు లు మరణించారు). 234 సీట్లకు గాను ఇప్పుడు 214 మంది శాసనసభ్యులు మిగిలారు. అధికార పార్టీకి 116 మంది ఎమ్మెల్యేల మద్దతు వుంది. తంగా తమిళ్ సెల్వన్ (అండిపట్టి), ఆర్ మురుగన్ (హరూర్), చో మారియప్పన్ కెన్నెడి (మానమధురై), డాక్టర్ కే కత్తికము (పెరియకులం), జయంతి పద్మనాభన్ (గుడియట్టం), పీ పళనియప్పన్ ( పప్పిరెడ్డిపట్టి), సెంధిల్ బాలాజీ (అరవకురిచ్చి), డాక్టర్ ముత్తయ్య (పరమకుడి), వెట్రివేల్ (పెరంబూర్), పార్ధీపన్ (షోలింగ్ ) కోదండపాణి (తిరుపోరూర్), ఏలుమలై (పూనమల్లి), రెంగసామి (తంజావూర్), తంగదురై (నిలకోటై), బాలసుబ్రమణి (అంబూరు), ఎదిర్కోట్టై సుబ్రమణియన్ (సత్తూరు) సుందర రాజ్ (ఒట్టపిడరం), ఉమా మహేశ్వరీ (విలతికులం) లు అనర్హతకు గురయిన ఎమ్మెల్యేలు.