వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ పక్క చూపులు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆయన కొంతకాలంగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామల పట్ల అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మరీ ముఖ్యంగా విజయనగరంలో జగన్ పాదయాత్ర సందర్భంగా తనకు తగిన ప్రాధాన్యత లభించకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.బొత్స విజయనగరం వైసీపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ల కోసం పలువురు పేర్లను సిఫార్సు చేస్తూ వచ్చారు. కనీసంగా అర డజన్ టికెట్లు కావాలంటూ ప్రతిపాదనలు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే జగన్ వీటిని పక్కన పెట్టారని అంటున్నారు. దాంతోనే బొత్స రగిలిపోతున్నారుట. తాను కాంగ్రెస్ నుంచి తెచ్చిన కోలగట్ల వీరభద్రస్వామికి తొలి టికెట్ ఇచ్చిన జగన్ తన వారికి మాత్రం ఉత్త చేయి చూపించడాన్ని బొత్స సహించలేకపోతున్నారని అంటున్నారు. బొత్స చూపు ఇపుడు జనసేన వైపు పడిందని అంటున్నారు. టీడీపీలో బెర్త్ లేకపోగా అక్కడ తన రాజకీయ శత్రువులు ఉండడంతో బొత్స జనసేన బెస్ట్ ఆప్షన్ గా చూస్తున్నారని అంటున్నారు. ఈ మేరకు ఆ పార్టీలోని నాయకులకు రాయబేరాలు కూడా పంపినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే పవన్ తన విజయనగరం టూర్ సందర్భంగా బొత్స పైనే ఎక్కువగా మండిపడ్డారు. పైగా ఆయన్ని డైరెక్ట్ గా టార్గెట్ చేసి అనేక విమర్శలు చేశారు. మరి ఆయన బొత్సను పార్టీలోకి తీసుకుంటారా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.జనసేనలో బొత్స చేరికకు అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. రాజకీయాల్లో ఆరోపణలు చేయడం మామూలేనని, పవన్ కూడా అవసరం బట్టి నాయకులను తీసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జనసేన పార్టీకి నాయకుల కొరత ఎక్కువగా ఉందని అంటున్నారు. బొత్స వంటి సీనియర్ వస్తే కాదనే పరిస్థితి ఉండదని కూడా చెబుతున్నారు. పైగా బొత్స కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ప్లస్ పాయింట్ గా పేర్కొంటున్నారు. జనసేనలోకి బొత్స బ్యాచ్ వెళ్తే అది హాట్ టాపిక్ గా మారడమే కాదు. వైసీపీ, టీడీపీలకు రాజకీయంగా భారీ నష్టంగా మారే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.