బీజేపీలో సీనియర్ నాయకుడు, విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు ప్రత్యక్ష రాజకీయాల పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారు. వర్తమాన రాజకీయం తీరుతెన్నుల పట్ల ఆయన కలత చెందుతున్నారని భోగట్టా. ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలపై హరిబాబు ఆసక్తిగా లేనట్లు ప్రచారం సాగుతోంది. ఏపీ రాజకీయాల్లో హరిబాబు చాలా కాలంగా పెదవి విప్పడంలేదు. బీజేపీ తనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాక హరిబాబు పూర్తిగా తెర వెనక్కు వెళ్ళిపోయారు. కావాలనే ఆయన ఇలా చేస్తున్నరని ఆయన అనుచరులు అంటున్నారు. ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలకు తోడు, పార్టీలోను సంభవిస్తున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న హరిబాబు మౌనంగా ఉండడమే మంచిదన్న భావనకు వచ్చారని అంటున్నారు.జరుగుతున్న పరిణామాలు కూడా అది నిజమేనని చెబుతున్నాయివచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు హరిబాబు నో అంటున్నారు. ఇప్పటికే ఆయన రాజకీయంగా తెరవెనక్కు పోతున్నారని అంటున్నారు. అవసరమైతే తప్ప ప్రెస్ మీట్లను కూడా పెట్టడం లేదు. పార్లమెంట్ సభ్యునిగా తన పదవీకాలాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న తరువాత ఇక పార్టీ రాజకీయీలకే పరిమితం అవుదామని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.జాతీయ రాజకీయాల వైపుగా హరిబాబు దృష్టిని సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుని హోదాలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. పార్టీలో మరింత కీలక పదవులు తీసుకుని తద్వారా పార్టీ పరంగా సేవ చేయాలనుకుంటున్నారు. అదే విధంగా తన సీనియారిటీకి గుర్తింపుగా రాజ్య సభ సభ్యత్వం కూడా ఆయన కోరుకుంటున్నారు. అన్నీ కుదిరితే డిల్లీ తెరపైన మెరవాలన్నది హరిబాబు ఆశగా చెబుతున్నారు. మరి ఈ సిట్టింగ్ ఎంపీ కనుక పోటీ చేయకపోతే విశాఖ నుంచి ఎవరు కమలనాధుడిగా బరిలో ఉంటారో చూడాల్సి ఉంది. ఆలాగే హరిబాబు ఏపీ రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆ ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నదీ చూడాలి.