తిత్లీ తుఫానుపై అధికారులను నిరంతరం అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ముందుగా తితిలీ తుఫానులో మరణించిన వారికి సంతాప సూచకంగా కలెక్టర్ల సదస్సు ఒక నిమిషం మౌనం పాటించింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుఫాను సమాచారం రాగానే ముందుజాగ్రత్త చర్యలపై ఆలోచించామన్నారు. అర్ధరాత్రి పలుమార్లు అధికారులతో మాట్లాడి ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని పేర్కొన్నారు. మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు పెట్టుకుంటున్నాం. ఇది బృందం పనితీరును పరిక్షించుకునే పద్ధతి. క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు మనమంతా ఒకే బృందంగా వున్నాం. విపత్తుల్లో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని అన్నారు. విభజన సమయంలో ఏదైతే భయపడ్డామో అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎంత సామర్ధ్యంగా పాలనా యంత్రాంగం పనిచేస్తుందో ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి. బృందం పనితీరుకు క్వార్టర్లీ పరీక్షలే ఈ కాన్ఫరెన్స్ లని అన్నారు. గోపాల్ పూర్ వద్ద తుపాన్ తీరం దాటుతుందని కేంద్ర ఏజెన్సీలు చెప్పాయి. కానీ మన రాష్ట్ర సంస్థలే తుపాన్ ఖచ్చితంగా ఎక్కడ తీరాన్ని దాటుతుందో, ఎప్పుడు తీరాన్ని దాటుతుందో ఖచ్చితంగా అంచనా వేశాయి.మన రాష్ట్ర ఏజెన్సీలు చెప్పిందే నిజం అయ్యిందని అన్నారు. ఉద్ధానం కిడ్నీ వ్యాధి సమస్యతో అసలే సతమతం అవుతోంది. తితిలీ తుఫాను ఇప్పుడా ప్రాంతాన్ని మరింత అతలాకుతలం చేసింది. రియల్టైమ్ గవర్నెన్స్ నుంచి తుఫాను కదలికలను పసిగట్టాం. 30, 35 మంది ఐఎఎస్ అధికారులు, 13మంది మంత్రులు, 110 డిప్యూటీ కలెక్టర్లు, సీనియర్ అధికారులు పనిచేశారని అన్నారు. నీరబ్ కుమార్ ప్రసాద్ను ఇన్ఛార్జిగా పెట్టాం. చరిత్రలో ఎప్పుడూ చేయని విధంగా 20 రోజులలోపు వ్యవసాయ, ఇతర నష్టాలన్నింటినీ అంచనా వేయగలిగాం. తుపాన్ సహాయ చర్యల్లో అందరూ అద్భుతంగా పనిచేశారు. 12రోజుల్లోనే సాధారణ స్థితికి తెచ్చారు.దసరాకు కూడా పోకుండా బాధితుల సేవల్లో నిమగ్నం అయ్యారు.సహాయక చర్యల్లో చెమటోడ్చిన అందరికీ అభినందనలని అన్నారు. సంక్షోభం వచ్చింది. అది ఎప్పుడూ చెప్పిరాదు. సంక్షోభం వచ్చినప్పుడే సవాలుగా తీసుకుని పనిచేయాలి. భయపడితే ప్రయోజనం లేదు. ఓపక్క ఇటు వర్షాభావంతో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాన్ని భూగర్భంలో ఇముడ్చుకోగలిగాం. జలవనరులపై దృష్టిపెట్టాం. సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నాం. తాగేందుకు నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. పంటలను కాపాడుకోగలుగుతున్నామని అన్నారు. ఓపక్క తుఫాన్లు, మరోపక్క కరువు పరిస్థితులు ఉన్నా వ్యవసాయంలో మంచి వృద్ధి సాధిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లోటు 25% ఉంది. మన జల సంరక్షణ చర్యలే మనకు అక్కరకు వచ్చాయి. 10లక్షల పంటకుంటలు తవ్వాం. సోమవారాన్ని పోలవరంగా మార్చాం.గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేశాం. భూగర్భజల వనరులు పెంచాం. ప్రాజెక్టుల కింద సేద్యాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. గత నాలుగేళ్లలో దేశంలో అత్యధిక వృద్ధిరేటు ఏపిదే. సగటున 10.5% వృద్ది సాధించాం. నాలుగు సంవత్సరాలలో 10.2 శాతం వృద్ధి రేటు సాధించాం. ఇది దేశంలో గరిష్ట వృద్ధి రేటు. తలసరి ఆదాయంలో వ్యవసాయంలో కంటే పరిశ్రమల రంగంలోనే మంచి ఫలితాలు వస్తాయి. తలసరి ఆదాయం వ్యవసాయం కంటె 4రెట్లు ఎక్కువ పరిశ్రమల్లో వస్తుంది. సేవారంగంలో 7రెట్లు వస్తుంది. సాంకేతిక రంగంలో ఆకాశమే హద్దని అన్నారు. కృత్రిమ మేధస్సులో ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ మానవ మేధకు ఏదీ సాటిరాదు. కృత్రిమ మేధ రంగ ప్రవేశంతో అభివృద్ధి కొత్త రూపు మార్చుకుంది. దీన్నిఆహ్వానించాల్సిందేనని ముఖ్యమంత్రి అన్నారు.