- పతనం దిశగా అమెరికా స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు నిరాఘాటంగా కుప్పకూలుతున్నాయి. ‘మోదీకేర్’ బడ్జెట్‌తో ప్రారంభమైన సెన్సెక్స్, నిక్కీ భారతీయ షేర్ మార్కెట్ల పతనం అమెరికా, యూరోపియన్, ఆసియా స్టాక్ మార్కెట్లు క్షీణించడంతో పరాకాష్ఠకు చేరుకుంది. ఎల్టీసీజీ (లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్), బడ్జెట్‌లో ద్రవ్యలోటు పెరగడం, వ్యవసాయోత్పత్తులకు ‘కనీస మద్దతు ధర పెంపు’, గ్లోబల్ స్టాక్‌మార్కెట్లుకూలిపోవడం, అమెరికా డాటా వివాదం, ఆర్బీఐ వడ్డీరేట్లలో నెలకొన్న అనిశ్చితి వెరసి భారతీయ స్టాక్ మార్కెట్లు కుదేలవడానికి దోహదం చేశాయని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. దాంతో రూ. 8 లక్షల కోట్లకు పైగా మదుపుదారులకు నష్టం వాటిల్లిందని అంచనా. లక్షల కోట్ల రూపాయాలు క్షణాల్లో ఆవిరవడం మదుపుదారులకే కాకుండా ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఉపకరించే విదేశీ మదుపుల ప్రవాహానికి ఇది పెద్ద అడ్డంకిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. దేశీయ ఆర్థిక, ద్రవ్య విధానాలకు తోడు అమెరికా స్టాక్ మార్కెట్లలో షేర్ల ధరలు తీవ్ర స్థాయిలో పతనమై, ఆ ఆర్థిక ప్రకంపన కేంద్రంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు వరుసపెట్టి కుప్పకూలాయి. గత రెండేళ్ల కాలంలో ఒక వారం రోజుల్లో స్టాక్ మార్కెట్ అమెరికాలో ఇంతగా ఎన్నడూ పతనం చెందలేదు. అమెరికా ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రేట్లు వేగంగా పెరుగుతుండడం, వేతనాల పెంపుతో పెరిగిన వ్యయం కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్‌లలో సంక్షోభం ఏర్పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రపంచ దేశాలు మహా ఆర్థిక సంక్షోభం నుంచి పైకి చూసేందుకు కోలు కుంటున్నట్లు కనపడుతున్నా, వాస్తవంలో గ్లోబల్ పేదరికం అనూహ్యమైన వేగంతో విస్తరిస్తుండడం వల్ల కొనుగోలు శక్తిలేక మార్కెట్ కార్యకలాపాలు స్తంభించి లోలోపల మరింత లోతుగా సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. స్టాక్ మార్కెట్ జూదం ప్రపంచ ప్రజల మదుపులను కొల్లగొడుతోంది. మదుపుదారులను, ప్రజలను బికారులుగా మార్చివేస్తోంది. 1930ల నాటి ఆర్థిక సంక్షోభ సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను తగ్గించడంతో ఆ దేశ మదుపుదారులు యూరోపియన్ స్టాక్ మార్కెట్లలో పోర్ట్‌ఫోలియో మదుపులు పెట్టారు. ముఖ్యంగా జర్మనీ తదితర దేశాల మార్కెట్లలోకి ప్రధానంగా పెద్ద ఎత్తున ప్రవేశించారు. ఆ స్టాక్ మార్కెట్లలో షేర్ల ధరలు విజృంభించి, పెట్టిన మదుపులు కొన్ని రెట్లు పెరిగిన అనంతరం, ఇప్పటిలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ హఠాత్తుగా పెంచివేయడంతో ఓవర్‌సీస్‌లోని మదుపుదారులు వేలంవెర్రిగా తమ మదుపులను యూరోపి యన్ ముఖ్యంగా జర్మనీ స్టాక్ మార్కెట్లనుంచి తరలించారు. పర్యవసానంగా యూరోపియన్ మార్కెట్లు కుప్పకూలడంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభం మహా సంక్షోభంగా పరిణమించి, చివరికి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఇలా స్టాక్ మార్కెట్ లావాదేవీలలో ద్రవ్య జూదం ద్వారా ప్రపంచ దేశాల సంపదలను కొల్లగొట్టే ఎత్తుగడను అమెరికా చేపట్టి ఆనాడు లాభపడింది. అయితే అమెరికా పారిశ్రామిక వస్తూత్పత్తి, వ్యవసాయ రంగాలు ఆనాడు పరిపుష్ఠిగా ఉండడం, స్థానిక మార్కెట్లు బలీయంగా ఉండడం వల్ల స్టాక్ మార్కెట్ జూద వ్యూహం ఫలించింది. పారిశ్రామిక వస్తూత్పత్తి, వ్యవసాయ రంగాలు సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఆ వ్యూహం అమెరికాకు శాపంగా పరిణమిస్తుంది. అందుకే నేడు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం పతనోన్ముఖంగా ప్రయాణిస్తున్నాయి.