వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఆ పార్టీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత జగన్ భద్రత, రక్షణ చర్యలను పటిష్టం చేయాలని పలుమార్లు కోరినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, వారి ఉద్దేశం ఇదేనా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. జగన్పై దాడి కుట్ర వెనుక ఎవరున్నారో చెప్పాలని, ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
జగన్ కాన్వాయ్ వాహనాలు సరిగ్గా లేవని, పలు పర్యటనల్లో మొరాయిస్తున్నాయని చెప్పినా చంద్రబాబు నాయుడు సర్కార్ పట్టించుకోలేదంటూ ఆయన మండిపడ్డారు. విశాఖ విమానాశ్రయంలో జగన్పై దాడి నేపథ్యంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు. ‘జగన్ గారి భద్రత, రక్షణ చర్యలను మరింత పటిష్టం చేయాలని గతంలో చేసిన అనేక విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. చివరకు ఆయన ప్రయాణించే వాహనాలు సైతం తరచుగా మరమ్మతులకు గురవుతూ మొరాయిస్తున్నా ప్రభుత్వం తీవ్రనిర్లక్ష్యం ప్రదర్శించడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఇదేనా?’ అని ట్వీట్ ద్వారా టీడీపీ సర్కార్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు.