ఆరుగాలం శ్రమించే రైతన్నకు తగిన ఫలం అందడంలేదు. దీంతో ఏళ్లుగా వారు ఆర్ధిక సమస్యలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రతికూల వాతావరణానికి తోడు సరైన మద్దతుధర దక్కకపోవడం రైతన్నలను వేధిస్తోంది. వ్యవసాయం అంటే ఆమడదూరం పరిగెత్తే పరిస్థితి కనిపిస్తోందని ఆదిలాబాద్ టమాటా రైతులు వాపోతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని కొద్దోగొప్పో చేతికందిన పంటకు కనీస మద్దతు ధర లభించకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో టమాటా సాగు అధికమే. పంట కోసం పెద్దమొత్తంలోనే ఖర్చు చేసేవారు ఎక్కువగానే ఉన్నారు. ఇంత ఖర్చు చేసినా చేతికి అందుతున్నది కొద్దిగానే ఉండడంతో ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి టమాటా రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. స్థానికంగా టమాటా ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఈ పంట పండించే రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్తున్నారు.