తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన సతీసమేతంగా ఢిల్లీ వెళ్లారు. నాలుగు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యి చూపించడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గత నాలుగు రోజులుగా పంటినొప్పితో బాధపడుతున్న కేసీఆర్, చికిత్స నిమిత్తం ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. చికిత్స అనంతరం విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన సమావేశమవ్వనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీల గురించి చర్చించనున్నారు. అలాగే మార్చి 11న తెలంగాణలో నిర్వహించనున్న పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రధానిని ఆహ్వానించనున్నారు.
కేసీఆర్ తన పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి చెందిన పలు సమస్యలపై ఆయన కేంద్రమంత్రులకు వినతిపత్రం అందజేయనున్నారు. ఫార్మాహబ్ నిర్మాణానికి సహకారం, కాళేశ్వరం జాతీయ ప్రాజెక్ట్ అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. వీటితో పాటు నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభ ముందస్తు ఎన్నికలు, జమిలీ ఎన్నికలపై కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీల అభిప్రాయాలు కూడా తెలుసుకునే అవకాశముంది.